Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంబులెన్స్ కనిపిస్తే… మానవతా హృదయం ఉన్న ఎవ్వరైనా పక్కకు తప్పుకుని ఆ వాహనానికి దారిస్తారు. భద్రతా విధులు నిర్వహించే పోలీసులు సైతం ట్రాఫిక్ ను పక్కకు మళ్లించి అంబులెన్స్ ను పంపిస్తారు. వీఐపీలు, వీవీఐపీలు సైతం అంబులెన్స్ కు దారివ్వమనే తమ భద్రతా సిబ్బందికి సూచిస్తుంటారు. కానీ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఈ కనీస మానవత్వం ప్రదర్శించడం లేదు. సిద్ధరామయ్య కాన్వాయ్ కోసం భద్రతాసిబ్బంది అంబులెన్స్ ను నిలిపివేయడంతో రోగిని నడిపించుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన మండ్యా జిల్లా నగమంగల ప్రాంతంలో జరిగింది.
ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ వస్తోండగా… అదే సమయానికి సీఎం కాన్వాయ్ వస్తోందంటూ భద్రతాసిబ్బంది రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి అంబులెన్స్ నిలిపివేశారు. దీంతో రోగి బంధువులు, ప్రజలు అంబులెన్స్ ను వెళ్లనివ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా అంబులెన్స్ ను వెళ్లనిచ్చేదిలేదని, అవసరమైతే అంబులెన్స్ లో రోగిని నడిపించుకుంటూ తీసుకెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదేమీ లేక రోగిని ఆమె బంధువులు నడిపించుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిద్దరామయ్య తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి ఇలా అంబులెన్స్ కు దారివ్వకపోడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో అరగంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది.