పవన్ పోటీ అక్కడి నుండే !

Pavan Trying To Contest In 5 Districts

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడెక్కడ నుండి పోటీ చేస్తున్నారనే అంశం మీద స్పష్టత వచ్చింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ జనసేన పార్టీ ప్రకటించింది. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ తెలియజేసిన విషయం తెలిసిందే. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఎక్కడ నుంచి పోటీ చేసేది గంట తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. పవన్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే అంశంపై జనరల్ బాడీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజకవర్గాలు తొలి స్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిదింటిపై అంతర్గత సర్వే నిర్వహించిన మేధావులు, రాజకీయ పరిశీలకులు చివరకు గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీచేయాలని పవన్‌కు సూచించారు. వారి ప్రతిపాదనలకు పవన్ సానుకూలంగా స్పందించారు. గాజువాక అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తారనే తొలి నుంచీ ప్రచారం జరగ్గా, రెండో సీటు మాత్రం అనూహ్యంగా రెండ్రోజుల నుండి ప్రచారంలోకి వచ్చింది. ఇక, ఎన్నికల్లో పోటీ విషయంలో అన్నయ్య చిరంజీవి మార్గాన్నే పవన్ అనుసరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరు పోటీ చేశారు. అయితే, తిరుపతిలో మాత్రమే విజయం సాధించిన చిరంజీవి, తన సొంత జిల్లాలోని పాలుకొల్లు మాత్రం ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పవన్ ఏమవుతారో వేచి చూడాలి.