పవన్ ఇప్పటికి క్లారిటీ ఇచ్చాడు !

Pawan Clarifies On Alliance with TDP

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఎంటరైన తర్వాత తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్న ఆ పార్టీ.. మూడున్నరేళ్ల తర్వాత రూటు మార్చింది. జనసేన పార్టీ నాల్గవ ఆవిర్భావ సభలో తెలుగుదేశం ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశాడు. అప్పటి నుంచి టీడీపీపై పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ యాత్రలు కొనసాగించాడు.

ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పోటీగా మారిపోయాడు. జనసేన ముఖ్య నేతలు జనసేన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని మాత్రం చెబుతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ‘‘టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే జగన్‌కు నొప్పి ఏంటి..? పవన్ కళ్యాణ్ మాతో రాకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌ను జగన్ తిడుతున్నాడు. ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఆయనకు బాధేంటి? ముందు జగన్‌ తన సంగతి చెప్పాలి. ఆయన బీజేపీతో కలుస్తాడా లేదా? దేశంలో ఆయన ఎక్కడ ఎవరితో ఉంటారో అది చెప్పాలి. పవన్‌ రాకూడదన్నది ఆయన బాధ. ఈ మధ్య నేను కూడా చూస్తున్నా. పవన్‌ కల్యాణ్‌ను తిడుతున్నాడు. జగన్‌ ఇతరుల గురించి కాదు. ముందు తన సంగతి చెప్పాలి’’ అంటూ మంగళవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు.

దీంతో అధికార పార్టీ జనసేనతో పొత్తును కోరుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్.. పార్టీని నైతికంగా దెబ్బతీయడానికే అధికార, ప్రతిపక్షా పార్టీలు ఇలాంటి అర్థం పర్థం లేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఊహాగానాలను జనసేన కార్యకర్తలు నమ్మొద్దని… మన సత్తా ఏంటో ఎన్నికల్లోనే చూపిద్దాం అంటూ పిలుపునిచ్చారు.