Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై జనసేనాని సంచలనకర వ్యాఖ్యలు చేశారు. కర్నాటక రాజకీయ ఎత్తుగడల గురించి తనకు ముందే తెలుసని పవన్ వ్యాఖ్యానించారు. నెల రోజుల క్రితమే తాను కొంత మంది అధికారులను కలిసినప్పుడు వారు తనతో పలు విషయాలు చెప్పారని పవన్ గుర్తుచేసుకున్నారు. కర్నాటకలో బీజేపీకి 90లోపు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నారని, వారి విధానాలు వారికి ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాలేంటో అందరికీ తెలుసని, దాని గురించి చేప్పుకోవల్సింది ఏమీ లేదని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని, అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయని, దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులను నీరుగార్చుతున్నారని విమర్శించారు. బీజేపీ ఒక్కటే కాదని, టీడీపీ, వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాయని, అన్ని పార్టీలూ బేరసారాలు చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కోరుకునే వారిలో తానూ ఒకరినని, దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరూ లేరని పవన్ అభిప్రాయపడ్డారు.