తెలుగులో కొత్త పత్రికలు… విచిత్ర భాగస్వామ్యాలు ?

pawan kalyan and deepa venkat as daily andra pepar Partnerships

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లుగా హైదరాబాద్ కి మాత్రమే పరిమితమై షో రన్ చేసిన తెలుగు మీడియా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడుతోంది. NRI లు కొనుగోలు చేసిన మహా టీవీ ఇక పూర్తి స్థాయిలో ఆంధ్ర కే పరిమితం కానుందని చెబుతున్నారు. ఇక టాప్ స్లాట్ వున్న మరికొన్ని ఛానెల్స్ కూడా త్వరలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక స్టూడియోలు నిర్వహించబోతున్నాయి. ఇక ఒకటి రెండు కొత్త ఛానెల్స్ కూడా విజయవాడ కేంద్రంగానే ప్రారంభం కాబోతున్నాయి. దీని అంతటికీ కారణం మరో ఏడాదిన్నర లో రానున్న ఎన్నికలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న ఛానెల్స్ వెనుక కొన్ని రాజకీయ పార్టీల నేతలు వున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ దూకుడు చూసి భారీ నష్టాలతో ఛానెల్స్ నడుపుతున్న వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

అంతకన్నా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఛానెల్స్ కన్నా ఖర్చుతో కూడుకున్న దినపత్రికలు కూడా మొదలు కాబోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం పాటు నడిచిన డైలీ ఆంధ్ర పత్రిక. అయితే కొన్నేళ్లుగా మూతపడిన ఈ పత్రిక మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఈ పత్రిక ముందుకు రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తం ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వెంకయ్య కేంద్రమంత్రి గా ఉండగా ఏపీ కి ప్రత్యేక హోదా అంశంలో పవన్ ఆయన మీద చేసిన విమర్శలు, దానికి కౌంటర్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్యాకేజ్ వల్ల ఎన్ని లాభాలో చెప్పిన వెంకయ్య… ఇలాంటి విషయాలు ఇంకా జనం మదినుంచి చెరిగిపోకముందే వెంకయ్య కుమార్తె, పవన్ కళ్యాణ్ ఓ పత్రిక వెనుక వున్నారనడం చిత్రంగా అనిపిస్తోంది.

ఇక తెలంగాణాలో రాబోయే ఇంకో డైలీ వెనుక ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక నడిపించిన సి.ఎల్. రాజం పేరు వినిపిస్తోంది. తెరాస తరపున రాజ్య సభ ఆశించి భంగపడ్డ ఆయన ఇప్పుడు మరో పత్రిక తేవాలి అనుకుంటున్నారట. అటు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే ఆలోచనతో వున్నారు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఒకే పత్రిక బయటికి తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలుగులో వస్తున్న పత్రికల వెనుక చిత్రవిచిత్ర భాగస్వామ్యాలు కనిపిస్తున్నాయి.