పవన్ కల్యాణ్ పెద్దగా కులాలను పట్టించుకోడు. తనకు అంతా ఒక్కటే అని చెబుతారు. అంతా నిజమే అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య పవన్ పై కొత్త విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆఫీసులో పనిచేసే చాలా మందిని కులాలను చూసి గౌరవిస్తారని అనే ప్రచారం ఉంది. ఆ పార్టీ పిఆర్వో హరి ప్రసాద్ మొదలు చాలా మంది అదే పద్దతిలో ఉంటారనే వాదన గతం నుంచే వస్తోంది. మిగతా కులాల వారు పవన్ ఆఫీసులో పని చేసేందుకు వస్తే తీసుకోరంటారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ముందస్తు జాగ్రత్తలు చెప్పి మరీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నారనే వార్త ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా నడిచింది. అయితే ఆ తర్వాత కూడా ఆయన తన పార్టీకి కులం పేరు అంటగట్టినా, తనకు కులాన్ని ఆపాదించినా కళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించారు. ఆ సంగతి పక్కన పెడితే గతంలో పవన్ కళ్యాణ్ కులాలను అంతగా పట్టించుకోకుండా కుల రహిత సమాజం అని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే అన్ని కులాలు అభివృద్ది పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించే పవన్ వాటిని అభివృద్ది నేనే చేస్తానంటూ తాజాగా హామీల వర్షం కురుపిస్తున్నారు. గతంలో సొంత కులం నాయకులు మీద కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసారు పవన్. కానీ ఇప్పుడు సొంత కులంతో పాటు బీసీల వైపు.. మైనార్టీల వైపు టర్న్ అయినట్లుగా తెలుస్తోంది. పవన్ సొంత కులం అయిన కాపు కులం పూర్తి డైలమాలో ఉన్న టైంలో మీకు నేనున్నా అంటూ మిగిలిన పార్టీలకు షాక్ తో పాటు తన కులానికి స్వీట్ తినిపించారు పవన్. కాపులను బీసీలో చేరుస్తానని చెప్పిన టీడీపీ మీన మేషాలు లెక్కపెట్టి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన తరువాత కుడా నామామాత్రపు స్పందన మాత్రమే చూపించడంతో కాపులు టీడీపీపై కూడా ఒకింత వ్యతిరేకతతో ఉన్నారన్నది వాస్తవం.అయితే తొలిసారి నేను కాపుని నా కులానికి తగిన న్యాయం చేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు రెల్లి సామాజికవర్గం దుస్థితిని చూసి తనకు వెక్కివెక్కి ఏడ్వాలని అనిపిస్తోందని తాను ఈ రోజు నుంచి రెల్లి కులస్తుడినేననీ, అందరికీ అండగా ఉంటానని అన్నారు. రెల్లి కులస్తుల బాధలు ఇకపై తన బాధలనీ, తనకు ఎలాంటి మతం లేదని ప్రకటించేసారు. అణగారిన కులాల్లో కూడా అణగారిన వర్గం రెల్లి కులమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇల్లు ఇద్దెకు ఇవ్వమని బ్రతిమాలడం కాకుండా, స్వయంగా తమ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇచ్చే స్థాయికి రెల్లి కులం ఆడబిడ్డలు ఎదగాలని ఆకాంక్షించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న జనసేన అధినేత ఈ రోజు రెల్లి సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెల్లి సామాజికవర్గం స్వయంకృషితో, తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకుంటానని పవన్ అన్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న రెల్లి సామాజికవర్గం మనస్సు చాలా గొప్పదనీ, ఇప్పటి నుంచి ఈ సామాజికవర్గం గొంతుగా తాను మారుతానని జనసేనాని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటించారు. మలమూత్రాలను చేత్తో ఎత్తే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కులం కారణంగా రెల్లి కులం వారికి ఇళ్ళు అద్దెకి ఇవ్వడం లేదని తాను ముఖ్యమంత్రి అవ్వగానే పారిశుద్ధ్య కార్మికులకు గృహవసతి, పెన్షన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అయితే నిన్న మొన్నటి దాకా తాను రాజకీయ నాయుకుడ్ని కాదు నాయకుడ్ని అని చెప్పుకున్న పవన్ ఇప్పుడు తాజాగా తాను కూడా రెగ్యులర్ రాజకీయనాయకుడినే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుల సంఘాల మీటింగ్ లలో ఇలాంటి ప్రకటనలు చేస్తూంటారు. ఉదాహరణకి మాదిగ సంఘాల సమావేశంలో పాల్గొని.. తాను పెద్ద మాదిగనని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయా కులాలను తనకు అన్వయించుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే కోవలో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతోసి దానికి నాకు కులాలు పట్టవు…కాలు విరగ్గోడతా అంటూ డైలాగులు ఎందుకో పవన్ సార్ కే ఎరుక.