Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. పాదయాత్ర ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. విభజన సందర్బంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తులేమో తెలంగాణకి, అప్పులేమో ఆంధ్రకి ఇచ్చారని మండిపడ్డారు. విభజనహామీల అమలు కోసం ఎన్నికల తర్వాత ఏడాది పాటు ఎదురుచూశామని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్రంపై మొదటి నుంచీ పోరాటం చేయలేకపోయాయని విమర్శించారు. మొట్టమొదటిసారి తానే కేంద్రం చేస్తున్న అన్యాయంపై తమ పార్టీ సభలో మాట్లాడానని, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పానని, అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారని పవన్ ఎద్దేవా చేశారు. మొదట్లో ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అది కూడా ఇవ్వలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని తెలిపారు. కేంద్రంపై పోరాడేందుకు అఖిలపక్ష సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నిన్న తనకు, తన పార్టీకి మళ్లీ లెటర్ అందిందని చెప్పారు. రెండేళ్ల క్రితం లేదంటే కనీసం ఒక ఏడాది క్రితం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే బాగుండేదని అన్నారు. అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభమో తనకు అర్ధం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని ప్రశ్నించారు. ముందు చంద్రబాబు తన మంత్రులతో కూర్చుని ప్రణాళికవేసుకోవాలని పవన్ సూచించారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని, ఇక మున్ముందు పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనుకుంటున్నారో చంద్రబాబు స్పష్టత తెచ్చుకోవాలని, ఆ తర్వాత వారి మనసులో ఏముందో తమకు తెలియజేస్తే, వారు పోరాడాలనుకుంటోన్న విధానంపై తాము ఆలోచించి… వారితో కలిసి పోరాడాలా లేదా అనే విషయం చెబుతామన్నారు. తాము జేఎఫ్ సీ నివేదిక రూపొందించిన కారణంగానే టీడీపీ, వైసీపీలపై ఒత్తిడి పెరిగిందని, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వరకు దారితీసిందని పవన్ వ్యాఖ్యానించారు.