Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటుచేసిన అఖిలపక్షం కాలం తీరిన మందులాంటిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. మూడేళ్ల కిందట ఏర్పాటుచేయల్సిన అఖిలపక్షాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంగళవారం నిర్వహించన అఖిలసంఘాల సమావేశాన్ని టీడీపీ రాజకీయ ఎత్తుగడగా జనసేన భావిస్తోందని తెలిపారు. ఇప్పుడు ఎలాంటి ఫలితం ఉండదని తెలిసీ, ప్రజల ఆగ్రహం అర్ధమయ్యాక తిలా పాపం, తలా పిడికెడు అన్నట్టు మీ పాపాన్ని మాకు పంచడానికా ఈ అఖిలపక్షం అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి కంటితుడుపు సమావేశాలు జనసేనకు ఆమోదయోగ్యం కావని, అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉన్నామని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ బాట పట్టాలని పవన్ కోరారు.
పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగి, రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని అభిప్రాయపడ్డారు. ఇది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసికట్టుగా చేయాల్సిన ప్రజాకార్యమని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లువేసి గెలిపించి, రాజ్యాంగపరమైన బాధ్యత టీడీపీపై ఉంచారని, ఆ బాధ్యత నేతలంతా నిర్వర్తించాలని పవన్ సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన అఖిల సంఘాల సమావేశానికి వైసీపీ, బీజేపీ, జనసేన తప్ప అన్ని పక్షాలూ హాజరయ్యాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం శాంతియుత పంథాలో ఉద్యమం నడపాలని సమావేశంలో నిర్ణయించారు.