జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ఆవేశంగా మాట్లాడారు. ‘టీడీపీ ఎమ్మెల్యేల కబ్జాలు, అవినీతి ఎక్కువైపోతోంది. ఇసుకలో కూడా దందా కొనసాగుతోంది. వారేమైనా పై నుంచి దిగొచ్చారా… మేం బానిసగిరీ చేస్తున్నామా… చొక్కాలు పట్టుకుని రోడ్లపైకి లాగుతాం. ప్రజాసంక్షేమం కోసం వచ్చిన ఎవరైనా… రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. దోపిడీలు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలా… పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యకండన్నారు’ పవన్. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం కంటే ముందుగానే జనసేనకు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రూపంలో పునాదులు పడ్డాయని పవన్ చెప్పారు. చిరంజీవి స్థాయి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పెనుమార్పులు వస్తాయన్న కారణంతో అప్పట్లో పాలకవర్గాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు.
ఆయన వస్తే ఏదైనా చేసేస్తారనే భయంతో కుటుంబంపై దాడి చేయడం మొదలుపెట్టారన్నారు. అప్పుడు తనకు కోపం వచ్చిందనీ, ఆ స్థాయి వ్యక్తి మీదే ఇలా దాడులు జరిగితే సామాన్యుడు ఎలా బతుకుతాడనే ఆవేదన కలిగిందన్నారు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఆ పార్టీకి కులం అంటగట్టారని, అందరి క్షేమం కోరి ఒక వ్యక్తి వస్తే కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి లేనిపోనివి ఆపాదించే ప్రయత్నం చేశారన్నారు. తన విషయంలో కూడా కొందరు ఇలాంటి ప్రయత్నమే చేయబోతే కాళ్లు విరగ్గొడతా అని వార్నింగ్ ఇచ్చానన్నారు. ‘మీరు పార్టీలు పెడితే కులాలు రావా, మేం పార్టీలు పెడితే కులాలు వస్తాయా..? ఏం న్యాయం ఇది..?’ అంటూ ఆవేశంగా పవన్ స్పందించారు. ఏం టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు కులం గుర్తుకు రాలేదా. ఎవరైనా తన పార్టీకి కులం పేరు అంటగట్టినా… నాకు కులాన్ని ఆపాదించినా కాళ్లు విరగ్గొడతా’ అని పవన్ తీవ్రంగా స్పందించారు. 2014లో టీడీపీ వారే తన దగ్గరకు వచ్చారనీ, సపోర్టు చేయమంటే చేశాననీ, తాను స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వలేదు కదా అని పవన్ చెప్పుకొచ్చారు.