Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వ్యక్తి ఆరాధన శృతిమించితే ఎలా ఉంటుందో చెప్పడానికి రేణు దేశాయ్ కి ఎదురైన కష్టం చూస్తే అర్ధం అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా తెలుగు ప్రజలకి ఆమె సురపరిచితం. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆమె బద్రి సినిమా టైం లోనే పవన్ తో ప్రేమలో పడ్డారు. సహజీవనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ ఆమెని పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి కారణాలు ఏమైనా రేణుకి విడాకులు ఇచ్చి పవన్ ఇంకో పెళ్లి చేసుకున్నారు. పవన్ కి పుట్టిన ఇద్దరు పిల్లల్ని పెంచుతూ రేణు దేశాయ్ పూణే లో సెటిల్ అయ్యారు. పవన్ తో విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన మర్యాదకి ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ తో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ వీలు అయినప్పుడల్లా ఆయన గురించి నాలుగు మంచి మాటలే చెప్పేవాళ్ళు. దీంతో పవన్ ఫాన్స్ ఖుషీ. మాజీ భార్య కూడా పవన్ ని ఇంతగా పొగుడుతుంటే అంతకు మించి ఆయన క్యారెక్టర్ కి దక్కే ప్రశంస ఏముంటుంది అన్నట్టు ఉండేవారు.
అంతా బాగుంది అనుకునేంతలో ఈ మధ్య కాస్త అనారోగ్యం కలిగితే ఒంటరి మనిషిగా పిల్లలతో కొనసాగడంతో కొన్ని ఇబ్బందులు రేణుకి తెలిసి వచ్చాయి. ఆ కష్టాన్ని బయటకు చెప్పుకునే క్రమంలో ఆమె తనకి కూడా పెళ్లి చేసుకుంటే బాగుండన్న ఆలోచన వస్తోందని చెప్పారు. ఇంకేముంది పవన్ ఫాన్స్ కొందరు వదినలా భావిస్తున్న ఆమె పెళ్లి చేసుకుంటే ఏదో చేయరాని తప్పు చేసినట్టు, అనరాని మాట అన్నట్టు రెచ్చిపోయారు. దీంతో రేణు దేశాయ్ షాక్ కావడమే కాదు మగవాడికి ఓ రూల్ ఆడదానికి ఓ రూల్ ఎక్కడ న్యాయం అని నిలదీశారు. విడాకుల తర్వాత ఏడేళ్ల పాటు ఒంటరిగా ఉండి కొన్ని ఇబ్బందులతో పెళ్లి చేసుకుంటా అన్న ఆలోచన, మాట చెప్పినందుకే ఇలా చేస్తారా అని ఆవేదన చెందారు. అంతటా సమానం, ఆకాశంలో సగం లాంటి మాటలు ఇప్పటికీ ఫాషన్ తప్ప సమాజంలో నిజమైన మార్పు ఇంకా రావాల్సి ఉందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ? అయినా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ, అభిమానం ఉంటే ఆయన జీవితం నుంచి వెళ్ళిపోయినా స్త్రీ ని ఇలా నొర్దేశించడం సమంజసమా ? రేణు ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇంకాస్త ఆమె మీద నిందారోపణలు చేయొచ్చు. కానీ నిజం నిప్పులాంటిది. దాన్ని పట్టుకుంటే మన చేతులే కాలతాయి.