రేణు దేశాయ్ రెండో పెళ్ళికి సిద్ధం కావడం, ఎంగేజ్ మెంట్ అయిపోవడం చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో కొందరు వ్యవహరిస్తున్న తీరుతో అసలు మనం ఏ కాలంలో వున్నామా అనిపిస్తోంది. “మా దేవుడు పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది కలుగకూడదు” అని నెత్తినోరు బాదుకునే వాళ్ళు ఒక్క సారైనా ఇద్దరు పిల్లలతో ఒంటరి మహిళగా ఆమె పడుతున్న కష్టం గురించి మాట్లాడారా ? ఈ మధ్య ఓ సారి తనకు అనారోగ్యం కలిగినప్పుడు పిల్లలు పడ్డ బాధ, హాస్పిటల్ కి వెళ్ళడానికి పడ్డ కష్టం గురించి రేణు దేశాయ్ బయటకు చెప్పుకున్నారు. ఆ రోజు వీరిలో ఒక్కరు కూడా ఆమెని ఇబ్బంది పడకుండా చూసుకోమని పవన్ కి విన్నపం చేసినట్టు ఎక్కడా చూడలేదు. ఇప్పటికీ మగాడికో న్యాయం, ఆడదానికి ఇంకో న్యాయం అని బూజు పట్టిన భావాలతో బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది.ఎక్కడో ఓ సెలబ్రిటీ గురించి ఇలాంటి ఇరుకు ఆలోచనలతో వుండే వాళ్ళు సొంత జీవితంలో ఇక ఎలా వేగుతారో ఏమో.
ఒకరికి ఒకరే అనుకునే భావాలు వున్న వీరిలో ఒక్కరికి కూడా పవన్ మూడో పెళ్లి చేసుకున్నప్పుడు అయ్యో రేణు దేశాయ్ ఎలా బతుకుందో అన్న ఆలోచన వచ్చి ఉండదు. ఒకవేళ వచ్చినా దాన్ని బయటకు చెప్పే దమ్ము , ధైర్యం లేకుండా పోయింది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం గడపలేకపోతున్నా అని చెప్పినప్పటికీ కుసంస్కారంగా మాట్లాడుతూ యువతరానికి తమని ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళని చూసి జాలి పడాలి. ఈ తరహా ఆలోచనలతో వ్యక్తి పూజకి అలవాటుపడి విశాల భావాలు, దృక్పధం లేకుండా మున్ముందుకు వెళితే ఎదురు దెబ్బలు తగలడం ఖాయం. రేణు దేశాయ్ తప్పొప్పులు గురించి మాట్లాడే ముందు తమని తాము తీర్చిదిద్దుకోకుంటే వీరిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి భారం తప్ప ప్రయోజనం లేదు.