పవన్ కళ్యాణ్ తో రహస్య స్నేహం చేస్తూ వచ్చిన చంద్రబాబు

పవన్ కళ్యాణ్ తో రహస్య స్నేహం చేస్తూ వచ్చిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్నేహం ఏమో గాని… చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించలేక ముందు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో స్నేహం వద్దని ఒక వర్గం ముందు నుంచి చంద్రబాబుకీ చెప్తున్నా… వినకుండా ఆయనతో రహస్య స్నేహం చేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు తనను తాను తిట్టించుకునే విధంగా పవన్‌ని తయారు చేశారు. ఇది పక్కన పెడితే… ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దెబ్బ పార్టీకి తగిలింద‌న్న‌ది సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వినపడింది.

రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తో రహస్య స్నేహం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఈ విషయం మేము చెప్పింది కాదు… పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నేతలు చంద్రబాబుకి స్వయంగా చెప్పిన మాట. పవన్ తో కలిసి పోటీ చేసి ఉండే బాగుండేది గాని… ఆయన్ను ఒంటరిగా బరిలోకి దించడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లు పోగొట్టుకున్నామని చెప్పారట.

దాదాపు 9 నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి కారణం కూడా అదే అనే విషయాన్ని నేతలు చంద్రబాబుకి వివరించారు. ఇక కాపు సామాజిక వర్గానికి బలం ఉన్న నియోజకవర్గాల్లో సీట్లు ఆలస్యం చేయడం కూడా పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. పవన్ కళ్యాణ్ ద్వారా లాభపడాల్సింది పోయి కొన్ని స్థానాలను చేజేతులా పోగొట్టుకున్నామనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారట. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సామాజిక వర్గాలు దూరం కావడం ఖాయమని ఆ జిల్లా నేత‌లు బాబుకు చెప్పార‌ట‌.

ఇక ప్రధానంగా బాబు వైఖరి పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి నచ్చడం లేదని, సీట్ల ఎంపికలో పవన్ నిర్ణయం బట్టి అడుగులు వేయడం ఏంటి అని వాళ్ళు అసహనంగా ఉన్న‌ట్టు తేలింది. ఏదేమైనా ప‌వ‌న్ ఎఫెక్ట్ ఈ యేడాది ఎన్నిక‌ల్లో టీడీపీపై ఎంత‌లా ప‌డిందో చంద్ర‌బాబుకు క్లీయ‌ర్‌గా అర్థ‌మైంది.