జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు కర్నూలులో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గతంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. కాగా సుగాలి ప్రీతీ హత్య జరిగినప్పటినుండి కూడా ఇప్పటికీ న్యాయం జరగకపోడానికి కారణం కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయిన మన రాజకీయాలే అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాగా ఇప్పటికైనా సుగాలి ప్రీతికి, తన కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రజలందరూ కూడా రోడ్లపైకి రావాలని, అలా చేస్తేనే ప్రీతికి న్యాయం జరుగుతుందని తెలిపారు.
అంతేకాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దిశా ఘటనపై ప్రజలు ఎలాగైతే రోడ్లపైకి వచ్చారో,ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్లపైకి వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఎలాగైనా సరే ప్రీతీ హత్యకి కారణమైనటువంటి నిందితులకు శిక్ష పడాల్సిందేనని ఆగ్రహించారు. ఇకపోతే సుగాలి ప్రీతీ కి న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని, ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హెచ్చార్సీని ఆశ్రయిస్తామన్నారు. ఈమేరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక ఎస్టీ అమ్మాయికి న్యాయం చేయకుండా రాజధానులు నిర్మిస్తే ఏం లాభం, ఒక సీమ బిడ్డకి ఇంతటి అన్యాయం జరిగితే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.