Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు చేసిన ఆఖరి సినిమా నా దేశం. 1982 అక్టోబర్ 27 న విడుదలై ఘన విజయం సాధించిన నా దేశం కి ఇప్పుడు పవర్ స్టార్ ఆఖరి సినిమాగా చెప్పుకుంటున్న వేదాళం రీమేక్ మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. అప్పట్లో రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం ప్రకటించాక ఎన్టీఆర్ నా దేశం సినిమా చేశారు. అది కూడా తనతో ఓ ప్లాప్ సినిమా తీసి దెబ్బ తిన్న దేవి వరప్రసాద్ ని ఆదుకోడానికి ,మరో నిర్మాత వెంకట రత్నం కి ఇచ్చిన మాట నిలుపుకోడానికి ఎన్టీఆర్ నా దేశం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కధ మీద కూర్చోడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో అమితాబ్ “లావారిస్ “ రీమేక్ హక్కులు తీసుకున్నారు.
హిందీలో లావారిస్ బాగా ఆడకపోయినా అదే కథతో ముందుకు వెళ్లారు. కేవలం 19 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకి ఎన్నడూ ఊహించనంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ కి . దాదాపు పాతిక లక్షలు ఇచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు . ఈ సినిమా షూటింగ్ గ్యాప్ టైం లో కూడా ఎన్టీఆర్ తన వద్దకు వచ్చే రాజకీయ నేతలతో మాట్లాడేవాళ్ళు. మొత్తానికి ఈ సినిమా హడావిడిగా తీసినా భారీ హిట్ అయ్యింది. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఇక ఇప్పటికే జనసేన కార్యకలాపాలు చూస్తున్న పవన్ ఇప్పుడు తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒకప్పుడు తనకు ఖుషీ లాంటి భారీ హిట్ ఇచ్చిన ఏ. ఎం . రత్నం కు ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేస్తున్నారు పవన్. పార్టీ పనుల్లో బిజీగా ఉన్నందున కథ మీద ఎక్కువ సమయం వెచ్చించకుండా వేదాళం రీమేక్ కి పవన్ మొగ్గు జూపారు. జనవరిలో మొదలయ్యే ఈ సినిమా షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.
షూటింగ్ విరామంలో పార్టీ కార్యకలాపాలు చూసుకునేందుకు వీలుగా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో జరిగేలా చూస్తారట. ఈ సినిమా కోసం పవన్ కి భారీ రెమ్యునరేషన్ అందుతుందట. అజ్ఞాతవాసి సక్సెస్ స్థాయిని బట్టి పవన్ పారోతోషికం, సినిమా అమ్మకాలు ఉంటాయట. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ముందు ఏమి జరిగిందో పవన్ కి అలాగే జరుగుతోంది. నా దేశం తర్వాత ఎన్టీఆర్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి సీఎం అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ అక్కడ కూడా ఎన్టీఆర్ లాగా సక్సెస్ అవుతారో ,లేదో చూడాలి.