రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధర్మం తప్పిందని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. అమరావతికి మద్దతు పలికి.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదని చెప్పి..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరవాత రాజధానిని మార్చుకోవడం సరికాదని పవన్ కల్యాణ్.. విమర్శించారు. పాలకులు చేసిన తప్పులతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి నిర్ణయాలతో భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై.. ప్రత్యేకంగా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఓ కమిటీ వేసిన పవన్.. అన్ని ప్రాంతాల నాయకుల దగ్గర్నుంచి అభిప్రాయాలు సేకరించారు. రోజంతా దానిపై అధ్యయనం చేశారు.
తర్వాత మీడియాతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు.. అన్ని జిల్లాల నేతలు కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అంచెలంచెలుగా రాజధాని నగరం నిర్మించుకోవచ్చన్నారు. రైతు కన్నీరు పెట్టిన ఏ నేల అయినా బాగుపడదన్నారు. అండగా ఉండాల్సింది పోయి కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. విశాఖలో రాజధానిని పెడతామని వైసీపీ ఇంకా చెప్పలేదని.. కానీ గందరగోళం మాత్రం సృష్టిస్తున్నారన్నారు. మీకు అమరావతి ఇష్టం లేకపోతే.. ధైర్యంగా రాజధానిగా ఒక ప్రాంతం పేరు చెప్పండి ..కానీ మూడు రాజధానులంటూ ప్రజల్ని గందరగోళం పరచవద్దన్నారు. రైతుల కోసం నా ప్రాణాలు అడ్డువేస్తానని పవన్ ప్రకటించారు. నవరత్నాలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు .. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికే మూడు రాజధానులు అంటున్నారని పవన్ తేల్చారు.
కర్నూలులో హైకోర్టు పెట్టడానికి మీకేం అధికారం ఉందని పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని.. కర్నూలులో హైకోర్టు అనడం ప్రజల్ని మోసం చేయడమేనని విమర్శించారు. రాజధానిపై వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికా మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో జగన్ అందర్నీ మోసం చేస్తున్నారని.. పవన్ మండిపడ్డారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు.. ప్రధాని కానీ.. కేంద్రమంత్రులు కానీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రజాస్వామ్యం ఉండేదని.. ఇప్పుడు అది లేదని.. పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యిటించనున్నారు. ఎర్రబాలెంలో ధర్నాలో పాల్గొంటారు. వెలగపూడి, తుళ్లూరులోనూ రైతులను పరామర్శిస్తారు.