అందరూ డబుల్ గేమ్ ఆడతారు కానీ.. మెగా బ్రదర్స్ మాత్రం.. ముగ్గురూ తలోగేమ్ ఆడుతూ.. కొత్తగా త్రిబుల్ గేమ్ పద్దతిని ప్రవేశ పెట్టినట్లుగా ఉన్నారు. ఈ గేమ్స్.. టాలీవుడ్ రాజకీయాల్లో కాదు.. అమరావతి రైతుల సమస్య విషయంలో. మెగా ఫ్యామిలీలో అన్న చిరంజీవి ఏది చెబితే.. అదే ఫైనల్ అనే చెప్పే తమ్ముళ్లు.. బామ్మర్దులు ఉన్నారు. ఆయన మాటను ఎప్పుడూ జవదాటలేదని మీడియా ముఖంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అమరావతి రైతుల ఇష్యూ దగ్గరకు వచ్చే సరికి.. అవేమీ.. తమ్ముళ్లకు ఎక్కడం లేదు. పైగా.. ఎవరి డైలాగులు వారు చెబుతున్నారు.
బిగ్ బ్రదర్ చిరంజీవి.. ఎవరూ అడగకపోయినా… మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. వైసీపీ విధానం అయిన.. రూ. లక్ష కోట్ల ఖర్చు అమరావతిపై పెట్టడం కరెక్ట్ కాదని.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చిరంజీవి ప్రెస్ నోట్..మెగాభిమానులకు తలవంపులు తెచ్చినట్లయింది. దాంతో వారు ఫేక్ అని ప్రచారం చేశారు. కానీ.. చిరంజీవి .. మళ్లీ అది ఫేక్ కాదని.. ఆడియో టేప్ రిలీజ్ చేశారు. వీడియోనే రిలీజ్ చేయవచ్చు కదా.. అని చాలామందికి డౌట్ వచ్చింది. కానీ ఆయన ఈ విషయంలో కొంత గోప్యత ఉంచుకోవాలనుకున్నట్లుగా ఉన్నారు. ఆయన అభిప్రాయాలపై.. పవన్ కల్యాణ్, నాగేంద్రబాబు ఏమీ మాట్లాడలేదు కానీ.. అన్న అభిప్రాయానికి భిన్నంగా తాము ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఆవేశంగా రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది చిరంజీవి అభిప్రాయానికి పూర్తిగా కాంట్రాస్ట్. ఇప్పుడు.. మరో బ్రదర్ నాగబాబు… మరో విధానం ప్రకటిస్తున్నారు. ఏపీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నలిగిపోతోందని.. నాగబాబు ఆవేశపడిపోతూ.. ట్వీట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు, జగన్ అని.. నాగబాబు ఉద్దేశం. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసమే.. అమరావతి ప్రారంభించారని.. జగన్ అదే రియల్ ఎస్టేట్ కోసం.. విశాఖకు రాజధానిని తీసుకెళ్తున్నారనే అర్థంలో.. ఆయన ట్వీట్ చేసి.. గొప్పగా తన అభిప్రాయాలని వెల్లడించానని అనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ ఇలా రాజధాని అంశంతో.. ఎప్పుడూ.. ఇబ్బంది లేకుండా.. తలా ఓ విధానాన్ని ఎంపిక చేసుకుని త్రిబుల్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైతుల పక్షాల నిలబడమంటే.. ఇలా చేయడం ఏమిటన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.