Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లో ఉండటమే సరైన మార్గం అని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే 6 ఏళ్ల వయసున్న చిన్నారి రేవతి గత కోనేళ్ళుగా మస్క్యూలర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో భాధపడుతోంది. ఎప్పటికైనా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలనేది ఆ చిన్నారి కోరిక. ఈ విషయాన్ని అనుచరుల ద్వారా తెలుసుకున్న పవన్ వెంటనే పాప ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పాపకు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఆ వీల్ చైర్ ను ఏర్పాటు చేస్తానని, అలాగే వైద్యానికి అవసరమయ్యే ఆర్ధిక సహాయాన్ని కూడ అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇలా పవన్ స్వయంగా వచ్చి కలవడం, సహాయం అందిస్తానని మాటివ్వవడంతో రేవతి, ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేసి పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరేళ్ళ ఆ చిన్నారికి కాళ్ళు, చేతులు పట్టు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడింది. కొద్దిసేపు పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒళ్లో కూర్చున్న చిన్నారి రేవతి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. గబ్బర్ సింగ్ సినిమా అంటే తకు ఇష్టమని చెప్పింది. ఆ సినిమాలో పాటలు పాడి, డైలాగ్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చట పడ్డారు. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని ‘ఈ కీర్తనలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా’ అని అడిగితే ‘మా సంగీతం మిస్ నేర్పుతున్నారు’ అని చెప్పింది.
రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పాప ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రుల అడిగి పవన్ తెలుసుకున్నారు. రేవతిని బెంగళూరులోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో చూపించామని, పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు వైద్యం ఉందనీ, ఖర్చు చాలా అవుతుందని వైద్యులు చెప్పారని పవన్ కు రేవతి తల్లిదండ్రులు చెప్పారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తోందని, ఒకవేళ చేయించకపోతే కండరాలు బిగుసుకుపోయి చాలా బాధపడుతోందని ఆమె తల్లి చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి.






