Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కేంద్రం చేసిన మోసం ఒక ఎత్తు అయితే ఏ పార్టీ కూడా ధైర్యంగా పోరాడే పరిస్థితి లేకపోవడం ఇంకో ఎత్తు. ఈ విషయంలో ఒకరి తప్పుని ఇంకొకరు ఎత్తి చూపడం మినహా ఎవరూ పోరాట స్ఫూర్తి చూపింది లేదు. ఓటుకి నోటు కేసు సీఎం చంద్రబాబుని , అక్రమ ఆస్తులు , అవినీతి కేసులతో జగన్ ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని నిలదీసే ధైర్యం చేయలేకపోయారు. ఇక ఇదే హోదా డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కూడా ఒకటిరెండు సభలు పెట్టి సైలెంట్ అయిపోయారు.
కానీ తాజాగా పవన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పైగా ఆయన ఇదే ఎజెండా తో పాదయాత్ర తలపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన హోదా కి సంబంధించి విజయవాడలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాజమాన్యం చేసిన తప్పిదంతో విద్యా సంవత్సరం కోల్పోయిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పవన్ భేటీ అయ్యారు. జరిగిన అన్యాయం మీద వారి పోరాట స్ఫూర్తిని పొగుడుతూ మీలా టీడీపీ , వైసీపీ పోరాడి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేదని పవన్ అన్నారు. ఆ మాటల్లో నిజం వుంది . అయితే 2014 ఎన్నికల ముందు టీడీపీ ,బీజేపీ కూటమికి ఓటేయమని అడిగినప్పుడు వారు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కి కూడా హోదా పాపం అంటింది. మిగిలిన పార్టీలను తిట్టడం ద్వారా తమ బాధ్యత నుంచి పవన్ తప్పుకోలేరు. ఆ తప్పుని సరిదిద్దుకోడానికి ప్రత్యేక హోదా అంశంలో పోరాడడం తప్ప పవన్ కి ఇంకో అవకాశం లేదు , రాదు.