Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ విభజన హామీల అమలు పోరాటం కోసం ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు దిశగా తొలి అడుగుపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో భేటీ అయ్యారు. బేగంపేటలోని లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విభజన హామీలు, జేఏసీ ఏర్పాటు, పార్లమెంట్ లో ఎంపీల ఆందోళన వంటి అంశాలపై వారిద్దరూ చర్చించారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు వంటి అంశాలపై జేపీతో చర్చించామని పవన్ తెలిపారు. రాష్ట్రవిభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో జేపీ ముందుగానే ఆలోచించారని పవన్ చెప్పారు. విభజన సమయంలో తెలంగాణ, ఆంధ్రకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని, ఈ నేపథ్యంలో దిశానిర్దేశం చేయాల్సిందిగా జేపీని కోరానని, అందుకు ఆయన సుముఖత వ్యక్తంచేశారని పవన్ తెలిపారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించిన రాజకీయ పార్టీలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
అందరితో కలిసి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్న ఉద్దేశంతో పవన్ ముందడుగు వేశారని, ఇది ఒక మంచి నిర్ణయమని, ఆయన నిర్ణయాన్ని అందరూ అభినందించాలని జేపీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో చర్చించిన తర్వాత, చట్టంలో పెట్టిన తర్వాత హామీలు నెరవేర్చకపోవడం చాలా దారుణమైన విషయమన్నారు. కొన్నింటిని చట్టంలో పెట్టకపోయినప్పటికీ సాక్షాత్తూ ప్రధాని, హోంమంత్రి పార్లమెంట్ లో హామీల రూపంలో ఇచ్చారని, ఇప్పుడు చట్టంలో అవిలేవని దాటవేయడం తగదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఏమీ దక్కకపోవడం అన్యాయమని, ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందాల్సినవి చాలా ఉన్నాయని, వాటిని విస్మరిస్తే ప్రభుత్వాల మీద, పార్టీల మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. ఏరుదాటాకా తెప్ప తగలేయడం ప్రమాదకర పరిణామమన్నారు. రాజకీయాల కోసం ప్రజలను బలిచేయవద్దని కోరారు. ప్రత్యేక హోదా కోసం పవన్ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
విభజన హామీలను ఏ రకంగా సాధించాలన్న అంశంపై అందరం కలిసి చర్చిస్తామన్నారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదని, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని జేపీ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇరుప్రాంతాల ప్రజల మధ్య అగాధం ఏర్పడిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ సామరస్యం వెల్లివిరుస్తోందని, ఇందుకు రెండు రాష్ట్రాల అధినేతలను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ పై జేపీ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక టాప్ హీరోగా కాలు మీద కాలువేసుకుని జీవించాల్సిన పవన్ కళ్యాణ్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని, జేపీ వ్యాఖ్యానించారు. ఆయనను చూడడానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారని, కానీ ఆయన మాత్రం సమాజానికి ఏదో చేయాలన్న తపనతో సవాళ్లతో కూడిన జీవనంలోకి వస్తున్నారని అభిప్రాయపడ్డారు. పవన్, తాను ఇద్దరం మనసు విప్పి లోతుగా మాట్లాడుకున్నామని, పేరు ఏదైనా రాజకీయ పార్టీల నేతలు, పౌరసమాజం నేతలు, పత్రికలు వారు… ఇలా ఎవరైనా తమలాంటి అభిప్రాయాలు ఉన్నవారు, అధికారమే పరమావధిగా భావించకుండా ఉండే వ్యక్తులు అంతా ఒకటై సమాజానికి ఏమి చేయగలమనే విషయాన్ని చర్చించుకున్నామని తెలిపారు.