Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొండగట్టు ఆంజనేయస్వామి దయవల్లే సుసాధ్యం అయిందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తున్న తనకు కొండగట్టులో ప్రమాదం జరిగిందని, ఆంజనేయుడే తనను కాపాడాడని ఆయన అన్నారు. అందుకే తాను కొండగట్టు ఆంజనేయుడి సన్నిధి నుంచే తన ప్రచారం ప్రారంభిస్తున్నానని చెప్పారు. తన యాత్రలో భాగంగా మొదట ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించాలనుకుంటున్నానని తెలిపారు. ఆంజనేయస్వామి దర్శనం తర్వాత కరీంనగర్ లో మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. తమ పార్టీకి హైదరాబాద్ లో ఆఫీస్ ఉందని, అలాగే ఏపీలో తమ మొదటి ఆఫీసును అనంతపురంలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతపురం పర్యటన తర్వాత ఇతర జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందన్నారు. కార్యకర్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతానన్నారు. తెలంగాణలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణపైనా ఆయన స్పందించారు.
తెలంగాణలో ఎటువంటి సమస్యలున్నాయో తెలుసుకుంటానని, ఈ రాష్ట్రం గురించి ఆలోచించి, అవగాహన తెచ్చుకున్న తర్వాతే ముందడుగు వేస్తానని స్పష్టంచేశారు. తెలంగాణలోని సమస్యలపై తమ బృందం అధ్యయనం చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వరలోనే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణలోనూ పర్యటించాలని, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని తన అభిమానులు అడుగుతున్నారని, భవిష్యత్తులో తెలంగాణలో ఎలా వ్యవహరించాలన్న విషయమై తాము విస్తృతంగా చర్చ జరుపుతామని తెలిపారు. ఓటుకు నోటు వచ్చినప్పుడు తాను స్పందించకపోవడానికి కారణం సమస్య మరింత రచ్చ కాకుండా ఉండాలనే అని పవన్ చెప్పారు. ఓటుకు నోటు తప్పని తనకు తెలుసని, అందుకే ఆచితూచి వ్యవహరించానని అన్నారు. రాజకీయంగా ఎవరికీ లబ్ది చేకూర్చే పనులు తాను చేయబోనని, తన ప్రతి అడుగు నిర్మాణాత్మకంగా ఉంటుందని తెలిపారు.