పశ్చిమగోదావరి జిల్లా జనసేన పోరాటయాత్రలో భాగంగా దెందలూరులో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని మీద అనుచిత వ్యాఖ్యలు చేసారు. రౌడీలు చట్టసభలకు వెళ్లి పిచ్చి వాగుళ్లు వాగితే ప్రభుత్వం ఏం చేస్తోందని, తన సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దని జనసేన పోరాట యాత్రకు వస్తుంటే సభ ఎలా పెడతారని కొందరి నుంచి బెదిరింపులు వచ్చాయని ప్రత్యక్షంగా చింతమనేనిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసారు.
మనలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా మనలో సాహసం ఉంటే రౌడీ మూకలు ఉంటే ఏం చేస్తాయంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు పవన్. 19 ఏళ్లకే సాయుధ పోరాటానికి సిద్ధమయ్యాననిఆకు రౌడీలను, గాలి రౌడీలను 16 ఏళ్ల వయసు నుంచే చూస్తున్నానన్నారు. తాను ప్రభుత్వానికి ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చిందో గతంలోనే చెప్పానని సీఎంను కలిసి బలమైన లా అండర్ ఆర్డర్ కావాలని ఆడపడుచులకు భద్రత కల్పించాలని కోరానని కానీ రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని అన్నారు.
న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని 27 కేసులున్న ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఓ దళిత వ్యక్తిపై దాడి చేస్తే పట్టించుకోలేదని కనీసం కేసు కూడా నమోదు చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేపై సీఎం చర్యలు తీసుకుంటారా లేక తామే చర్య తీసుకోమంటారా అని ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టాలంటే అగ్నిగుండం సృష్టించగలనన్నారు పవన్. అమాయకులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని.. జనం కోసం జన సైనికులు ఉన్నారన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే, మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఐదు లక్షల బీమా, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. సహకార సంఘ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అయితే, వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి కొంత వ్యవధి కావాలని, వారి నుంచి నేరుగా సమస్యలు విని, అర్థం చేసుకుంటే వాటిని మేనిఫెస్టోలో ఎలా చేర్చాలన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం తేలికవుతుందని అన్నారు. జనసేన పార్టీని చాలా ప్రతికూల పరిస్థితుల్లో స్థాపించానని, ప్రస్తుత రాజకీయాలు అవకాశవాదంతో నిండిపోయాయని విమర్శించారు.