‘పింక్’ రీమేక్‌తో రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. మళ్లీ సినిమాలు చేయడం వల్ల పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలు వస్తాయని తెలిసీ పవన్ రంగంలోకి దిగాడు. ఐతే రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్నపుడు.. తన వృత్తి అయిన సినిమాను తానెందుకు వదిలిపెట్టాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాడు పవన్.
పైగా ఓవైపు షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మరోవైపు రోజువారీ రాజకీయ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్లో పాల్గొని.. రాత్రికి పార్టీ కార్యక్రమాల్లో పవన్ కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇది ‘పింక్’ నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం పుణ్యమే అని.. కోటి రూపాయల ఖర్చుతో ఆయనీ ప్రత్యేక ఏర్పాటు చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే పవన్ డిమాండ్ చేసి ఈ ఏర్పాటు చేయించుకున్నాడని, నిర్మాత మీద ఇలా భారం మోపడం కరెక్టేనా అనే చర్చ కూడా నడుస్తోంది జనాల్లో. అయితే పవన్‌కు ఏ పరిస్థితుల్లో విమానం ఏర్పాటైందనే విషయాన్ని జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడు కాదని.. ఆయనకు ఇప్పుడు నటనే పార్ట్ టైం అని.. పింక్ రీమేక్ ఒప్పుకున్న సమయంలో కూడా తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల గురించి నిర్మాతకు స్పష్టంగా చెప్పాడని.. రాజకీయ కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నా షూటింగ్‌లు ఆపాల్సి ఉంటుందని చెప్పారని.. అప్పుడు రాజే ప్రత్యేక విమానం ప్రపోజల్ పెట్టారని.. ఈ సినిమా కోసం సరిగ్గా 30 రోజుల కాల్ షీట్లే ఇవ్వగా.. ఆ 30 రోజులూ ఆయనతో పాటు ఒక విమానాన్ని ఉంచి షూటింగ్ అవ్వగానే విజయవాడ, ఇతర ప్రాంతాలకు వెళ్లి రాజకీయ కార్యక్రమాలు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారని.. ఇంతకుమించి ఇందులో వివాదం ఏమీ లేదని మనోహర్ స్పష్టం చేశారు.