Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభలో ప్రధాని ప్రసంగం తర్వాత ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ ఎంపీల నిరసన ప్రభావం ప్రధాని ప్రసంగంలో కనిపిస్తుందని, విభజన హామీలపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేస్తారని పెట్టుకున్న ఆశలు నెరవేరకపోవడంతో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన జనసేనాని కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆందోళన బాట పట్టేందుకు సిద్దమయ్యారు. జనసేన గొంతు సరిపోనందున, ఇతర నేతలను కలుపుకుని ముందుకుపోతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిసారని, లోక్ సభను స్తంభింపచేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు సాధించేందుకు ఒక వేదిక ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.
మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి వారిని వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయని పవన్ విమర్శించారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని భావించి అపారమైన రాజకీయ అనుభవం ఉన్న మోడీ, చంద్రబాబుకు మద్దతిచ్చానని తెలిపారు. ప్రత్యేక హోదాపై ఎవరూ పట్టించుకోకపోతే, తాను తిరుపతి, కాకినాడ సభల్లో కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించానని, కొన్నిరోజులకు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నారని చెప్పారు. టీడీపీ నేతలు ఒకసారి ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటారని, మరోసారి బాగాలేదంటారని, ఇలా వాళ్లు చెబుతున్న తికమక మాటలవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోతోందని పవన్ విమర్శించారు. విభజన హామీలు అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు.