Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఆ పార్టీ అధినేత తీసుకున్న చర్యల్లో ప్రధానమైనది ఆ పార్టీ తరపున ఐటీ, సోషల్ మీడియా విభాగాన్ని యాక్టివ్ చేయడం. ఆ విభాగానికి శతఘ్ని అని పవర్ ఫుల్ పేరు కూడా పెట్టారు. పేరు అయితే అదిరిపోయింది గానీ పనితీరు ఆ రేంజ్ లో లేదు. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ని పవన్ టార్గెట్ చేసినప్పటినుంచి సోషల్ మీడియాలో పవన్ మీద దాడి ఉధృతమైంది. ఎప్పుడైతే పవన్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రత్యేక హోదా కన్నా నిధులు ముఖ్యం అని చెప్పారో అప్పటినుంచి జనసేన, బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందన్న ప్రచారం ఊపు అందుకుంది. చివరకు పవన్ వీరాభిమానులు సైతం ఈ వాదనలు ఖండించలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. జనసేన తరపున టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు ఈ మాటల దాడిని నిలవరించడంలో విఫలం అవుతున్నారు. వారి అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
టీవీ చర్చల్లో వైఫల్యం ఎలా ఉన్నప్పటికీ కనీసం సోషల్ మీడియాలో అయినా జనసేన తరపున శతఘ్నులు పేలతాయని ఆశించినవాళ్లకు నిరాశే ఎదురు అయ్యింది. సోషల్ మీడియాలో పవన్ మీద దాడిని ఎదుర్కోవడంలో శతఘ్ని అట్టర్ ప్లాప్ అయ్యింది. పవన్ అనుకూల వాదన వినిపించడం మాట పక్కనబెట్టి కనీసం ఆయన బీజేపీ తొత్తు కాదు అని చెప్పడంలో కూడా విఫలం చెందింది. ఇదే విషయాన్ని ఆ శతఘ్ని లో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ వ్యక్తి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు కూడా హేతుబద్ధం అనిపించింది. ఇంతకీ ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే… పవన్ తీసుకున్న వైఖరి, మాట తీరుతో ప్రజలు ఆయన్ని బీజేపీ అనుకూల వాడిగా చూడ్డంతో తాము ఎంత చెప్పినా అంగీకరించే పరిస్థితి లేదని సదరు శతఘ్ని ప్రతినిధి అభిప్రాయం. ఆ విధంగా పవన్ చేసిన తప్పుకు జనసేన శతఘ్ని పేలకుండా తుస్ అంది.