మొన్నటిదాకా జగన్ మాట మెదిలితే నేనే సీఎం నేనే సీఎం అని భజన చేసేవారు. మరి అదేమీ విచిత్రమో గానీ ఆ డ్యూటీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎత్తుకుని నేనే సీఎం నేనే సీఎం కలవరిస్తున్నారు. ఒకప్పుడు నాకు సీఎం పదవి మీద ఆశ లేదు అని బల్లగుద్ది చెప్పిన పవన్ ఇప్పుడు సీఎం పదవి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు నిర్మొహమాటంగా చెబుతున్నారు. పైగా ఏమైనదో ఏమో కాని మొన్నటి వరకు చంద్రబాబుని ఆయన కుమారుడిని… టీడిపి ఎమ్యెల్యేలను మాత్రమే విమర్శించిన పవన్ గత వారం రోజులుగా రూటు మార్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా జగన్ ని పల్లెత్తు మాట అనని జనసేనాని ఇప్పుడు జగన్ స్పందించకపోయినా వైసిపి నేతలు పట్టించుకోకపోయినా పవన్ మాత్రం ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అదీ కూడా జగన్ వ్యక్తిత్వం మీద కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కి మగతనం లేదని పరుషంగా వ్యాఖ్య చేసిన పవన్ ఆ తర్వాత మరిన్ని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. జగన్ పైనా జరిగిన దాడిని కూడా ఇప్పుడు పవన్ తన విమర్శలకు ఆయుధంగా చేసుకున్నారు.
ప్రజల సమస్యలపై పోరాడటానికి ఒక ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతే, అసెంబ్లీకి వెళ్లడం చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే ఎమ్మెల్యేలు మొత్తం అమ్ముడుపోయినా తాను ఒక్కడినే అయినా అసెంబ్లీకి వెళ్లే వాడినని పవన్ మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రిగా చూడాలనుకనే వ్యక్తులు మీ ముందు ముగ్గురే ఉన్నారు. శక్తి సన్నగిల్లి, కొడుకు మీద మక్కువతో వ్యవస్థను చెప్పుచేతల్లోకి తీసుకున్నారు చంద్రబాబు. అలాంటి వ్యక్తి వారసుడు.. సత్తా, సమర్థతలేని లోకేష్ సీఎం కావాలా? ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడాల్సింది పోయి పారిపోయి రోడ్లపై తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా? ఏమీ ఆశించకుండా రూ.100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ కావాలా? ఎవరు కావాలి సీఎం? మీ చేతుల్లోనే ఉంది’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
‘విపక్ష నేత జగన్ కోడికత్తిపై రాద్ధాంతం, రాజకీయం చేశారు. కానీ, నేను అలా చేయను. తన కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఇటీవల ఇసుక లారీని ఢీకొట్టిన సంఘటనను పవన్ గుర్తుచేస్తూ.. ‘ఐదు రోజుల క్రితం రాజానగరం నుంచి వస్తుంటే ఒక ఇసుక లారీ వచ్చి మన కాన్వాయ్‌ను గుద్దేసింది. నా కారును దాటి నన్ను కాపాడే అంగరక్షకుల కారును ఢీకొట్టింది. 8 మందికి గాయాలయ్యాయి. అదే రోజున హైదరాబాద్‌లో దిగి ఇంటికి వెళ్తుంటే మనోహర్ గారి కారును మరో ఇసుక లారీ గుద్దేసింది. జగన్ మోహరెడ్డి గారు దీని మీద ఎందుకు గోల చేయలేదు. ఒక కోడి కత్తి భుజం మీద గుచ్చితే గుచ్చారో.. గుచ్చారో.. అని గోల చేశారు. దమ్ముంటే బయటికొచ్చి పోరాటాలు చేయండి. ఆ ధైర్యం లేదు మీకు. మా ప్రమాదాన్ని మేం రాజకీయం చేయలేదు. పోలీసులకు వదిలేశాం’ అని జగన్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలు కుతంత్రంతో చేసినవైతే మాత్రం జనసేన చేతులు కట్టుకుని కూర్చోదన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌కు భద్రత కల్పించాలని నెల రోజుల క్రితం దరఖాస్తుచేసినా, ఇంతవరకు డీజీపీ కల్పించలేదన్నారు.
గతంలో విపక్ష నేతగా చంద్రబాబునాయుడుకు జడ్ కేటగిరీ భద్రతను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఉపసంహరిస్తే, ప్రధాని మన్మోహన్ వద్దకు వెళ్లి వేడుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యర్థులను ఇసుక లారీలతో తొక్కించేద్దాం అనుకుంటే సహించబోమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో ఒకసారి అశాంతి మొదలైతే ఆపడం ఎవరి తరం కాదని, ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు. తమ నాయకులకు రక్షణ కరవైతే డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మంత్రి లోకేష్ ఇలాంటి కుతంత్రాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే ఇక్కడ చంద్రబాబుని తక్కువ టార్గెట్ చేస్తూ జగన్ న ఉ ఎక్కువ టార్గెట్ చేయడం చూస్తుంటే జనసేన అధికారంలోకి రావడం కంటే ప్రతిపక్ష పాత్ర అయినా పారలేదని ఫిక్స్ అయినట్టు ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.