ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై జగన్ సర్కారును టార్గెట్గా చేసుకొని జనసేనాని పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేశారు. ఆరో శతాబ్దంలో ఏడు వేల గ్రామాల మండలమైన రేనాడు లోనే తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ దొరికాయన్న పవన్ పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం అప్పటి రేనాడు గ్రామాలేనన్నారు. కడపకే చెందిన వైఎస్ఆర్సీపీ నేత తెలుగును నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.
కడపలో సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఉందన్న జనసేనాని.. అందులో 66 వేల తెలుగు పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలనేది కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, హిందీ మాట్లాడే వారి నుంచి నేర్చుకోవాలన్నారు.
‘యాసను, సంస్కృతిని అవమానపరిచినందుకే తెలంగాణ విడిపోయింది. మరి మాతృ భాషని అగౌరపరిచి, ఉనికిని చంపేస్తానంటే ఏం జరుగుతుందో నాయకులూ ఊహించగలరా?’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు