Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన ఓ రాజకీయ పార్టీగా అయితే ఆవిర్భవించింది గానీ ఇంకా పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టలేదు. అందుకే ఆ పార్టీ బలం ఎంత అన్న దానిపై అంచనాలు, ఊహాగానాలు తప్ప కచ్చితమైన అవగాహన లేకుండా పోయింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓ ప్రకటనతో ఆ పార్టీ బలం మీద అంచనా ఏర్పడే వెసులుబాటు దొరికింది. నిజానికి 2014 ఎన్నికల ముందే జనసేన గురించి ప్రకటన చేసిన పవన్ అదే పార్టీ అధ్యక్ష హోదాలో ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన జనసేన పార్టీని అధికారికంగా ప్రారంభించారు. అప్పుడు ఒక్కరితో మొదలై ఇప్పుడు 20 లక్షల మంది భాగస్వాములు అయ్యారని పవన్ ఇచ్చిన తాజా స్టేట్ మెంట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేంటా అని చూస్తే ట్విట్టర్ లో ఆయన ఫాలోయర్స్ అని అర్ధమైంది.
తన సోషల్ మీడియా సైన్యం గురించి పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అయితే ఆయన రాజకీయ శక్తిని తక్కువ అంచనా వేయడం పొరపాటే అవుతుంది. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ అధికారానికి దూరం అయ్యింది. ఇప్పుడు పవన్ ఫాలోయర్స్ సోషల్ మీడియాలో ఈ 20 లక్షలు అయితే ఆ పార్టీ వోట్ బ్యాంకు కనీసం అందుకు డబల్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వోట్ బ్యాంకు ఉందంటే 2019 ఎన్నికల్లోనూ పవన్ పాత్ర కీలకం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం జనసేన బలం చూస్తుంటే సొంతంగా అధికారంలోకి వస్తుందని చెప్పలేము గానీ అధికారాన్ని ఎవరికీ అప్పగించాలి అన్న అంశాన్ని మాత్రం తప్పకుండా ప్రభావితం చేస్తుంది.