Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. ఈ మార్పుకి బీజం ఎప్పుడో పడినా తక్షణ కారణం మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ… అందులో ఆయన చేసిన ప్రసంగం. ఈ ప్రసంగంతో ఒక్క రాష్ట్ర రాజకీయమే కాదు జాతీయ రాజకీయాల్లోనూ కదలిక వచ్చింది. ప్రధాని మోడీ ఇప్పుడు అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ పరిణామానికి తక్షణ కారణంగా నిలిచిన పవన్ గెలిచినట్టా లేక ఆ ప్రసంగానికి దీటుగా స్పందించిన చంద్రబాబు నెగ్గినట్టా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయినా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్ ని కాస్త నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు, పవన్ లలో ఎవరు నెగ్గినట్టో తేలిపోతుంది.
జనసేన ఆవిర్భావ సభ ప్రసంగం తరువాత పవన్ మీద టీడీపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ తొత్తుగా మారి తమపై ఆరోపణలు చేసాడని టీడీపీ నేతలు పవన్ మీద విరుచుకుపడ్డారు. ఈ విమర్శల నుంచి తప్పుకోడానికి అన్నట్టు పవన్ వెంటనే తన వెనుక కాషాయ దళం లేదని కేవలం వామపక్షాలు ఉన్నాయని చెప్పుకోడానికి ప్రయత్నం చేశారు. విజయవాడలో సిపిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మరీ వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. మధు సహా సిపిఎం, సిపిఐ లకి చెందిన నాయకుల మీద ప్రశంసలు కురిపించారు. ఇకపై వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తానని సంకేతాలు పంపారు. దీంతో అంతోఇంతో ఆసరా ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తున్న లెఫ్ట్ నేతలు కూడా చప్పట్లు చరిచారు.
ఈ ఎపిసోడ్ ఇక్కడ నడుస్తుండగానే ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీ అయిపోయింది. తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్నారు. అలాగే లెఫ్ట్ నేతల సాయం కూడా కోరారు. ఇన్నాళ్లు బీజేపీ తో అంటకాగిన చంద్రబాబు స్వయంగా లెఫ్ట్ నాయకులకు ఫోన్ కూడా చేయలేదు. అయినా వామపక్షాలు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు ప్రకటన కూడా చేశాయి. ఈ విషయం వామపక్ష నేతలతో కలిసి వున్నప్పుడే పవన్ కి కూడా చేరిపోయింది. ఆయన మొహం జేవురించిందట. ఇప్పుడు చెప్పండి పవన్, చంద్రబాబుల్లో ఎవరు గెలిచినట్టో ?