ముఖ్యమంత్రి గారూ.. బట్టలూడదీసి కొడతాం ! : పవన్‌ కళ్యాణ్ వార్నింగ్

pawan kalyan warning on chandrababu naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినా, కిరాయి మూకలు, గూండాలతో దాడికి ప్రయత్నిస్తే బట్టలూడదీసి తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. తాను అన్నింటికి తెగించిన వ్యక్తినని, తప్పుడు సంకేతాలకు, తప్పుడు వేషాలకు భయపడే వాడిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారూ.. మీరు రౌడీలను, గూండాలను పంపితే, మేము సైనికుల స్ఫూర్తితో మీ కిరాయి గూండాలను బట్టలూడదీసి కొడతాం, తరిమి తరిమి కొడతాం. టెక్కలిలో జనసేన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టించారు. రాత్రి పలాసలో విద్యుత్ సరఫరా నిలిపివేసి భయపెట్టాలని చూశారు. ఇలాంటి వాటికి భయపడేవారు కాదు జన సైనికులు. కవాతు ఆపిన గుండెల్లో మాటలు అగవు, తూటాలు దిగినా అడుగు ముందుకే, వెనకడుగు వెయ్యదు’ అని పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

‘శ్రీకాకుళం సైనికులు పుట్టిన నేల.. స్వేచ్ఛామాత పుట్టిన నేల… భరతమాతకి గుడివున్న ఏకైక నేల.. దేశంలో ఏ మూలకెళ్లినా ఓ శ్రీకాకుళం సైనికుడు కనపడతాడు. జైహింద్ అంటాడు. వాడికి స్ఫూర్తిగానే ఈ మిలటరీ చొక్కా వేసుకున్నాను. రౌడీలను, గూండాలను పంపిస్తే… మేం సైనికులమని గుర్తుపెట్టుకోండి… నిర్ధాక్షణ్యంగా ఉంటాం. కిరాయి గుండాలను బట్టలూడదీసి కొడతాం… వేషాలు వేయొద్దు నా దగ్గర.. మీ గుండాలకి.. కిరాయిమూకలకి… భయపడతామనుకున్నారా.? జాగ్రత్త.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త ఆరోగ్య మంత్రిని నియమించేందుకు, ఉద్దానం కిడ్నీ సమస్యలు నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఒకవేళ చంద్రబాబు దిగిరాకుంటే తన యాత్రను ఆపేసి, ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తనకు అధికారం లేకపోయినా సమస్యలపై స్పందిస్తున్నానని, అధికారంలో ఉన్నవారు స్పందించకుంటే ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు.