ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పాత్రలో బాగానే ఇమిడిపోతున్నాడు. జగన్ నేనే కాబోయే సీఎం అంటుంటే , నన్ను సీఎం చేయండి అని జనాన్ని అడుగుతూ పవన్ కూడా సీన్ రక్తి కట్టిస్తున్నారు. ఇంతకీ పవన్ లో సరికొత్తగా కనిపించిన రాజకీయ కోణం ఏంటనేగా డౌట్ . అక్కడికే వస్తున్నాం. సాక్షి ఛానల్ , సాక్షి పత్రిక ని వైసీపీ ప్రచారానికి సూపర్ లెవెల్ లో వాడుకుంటూ కూడా మొన్నామధ్య నా చేతిలో మీడియా లేదు అని జగన్ గారు మహభేషుగ్గా సెలవిచ్చారు. ఈ విషయంలో అప్పట్లో నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వచ్చిన సినీ నటుడు వేణుమాధవ్ ఓ రేంజ్ లో జగన్ ని ఆడుకోవడం, దానిపై వైసీపీ అభిమానులు సీరియస్ గా రియాక్ట్ అవ్వడం అందరికీ తెలిసిన కధే. ఇప్పుడు అలాంటి కధే వినిపిస్తూ పవన్ దొరికిపోయారు.
నరసాపురంలో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానుల్ని చూసిన ఊపులో మీరు సీఎం ,సీఎం అని అరవడం కాదు. అందుకు అవసరం అయిన ఓట్లు తీసుకురావడానికి ప్రయత్నించాలి అని వారికి హితబోధ చేశారు. అంతవరకు ఓకే. అయితే అభిమానుల మీద చాలా ఆశలు పెట్టుకున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తూ నా వెనుక పత్రికలు,చానెల్స్ లేవని పవన్ గట్టిగా చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటల్ని జనసేన అండతో నడుస్తున్న 99 ఛానల్ రిపోర్టర్ గట్టిగానే పట్టుకున్నారు. ఇక ఈ మధ్యే జనసేనలో చేరిన ఆంధ్రప్రభ అధినేతల ప్రత్యేక ఆదేశాల మేరకు ఆ పత్రిక విలేకరులు కూడా బాగానే కవర్ చేశారు. అయినా ఓ వైపు 99 ఛానల్ , ఆంధ్రప్రభ మనవే అంటూ ఫ్యాన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ హఠాత్తుగా ఇలా మాట్లాడ్డం చూస్తుంటే ఆయనకేమో గానీ చూస్తున్న జనానికి ఎలాగో వుంది. రాజకీయ నాయకులు అంటే పచ్చి అబద్ధాలు ఆడతారని ఇప్పటికే జనానికి ఓ అభిప్రాయం పడిపోయింది. ఆ రాజకీయాన్ని మారుస్తానని చెప్పి జనంలో తిరుగుతున్న జనసేనాని కూడా అవే మాటలు చెప్తున్నారు. సామాన్య జనం మాటేమో గానీ ఫ్యాన్స్ కూడా పవన్ చెప్పేది నిజమో, ఆ పత్రిక , ఛానల్ కోసం జనసేన చెప్పేది నిజమో అర్ధం కాని అయోమయంలో పడిపోతున్నారు.