వారాహి యాత్రతో పవన్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో, విశాఖలో పవన్ యాత్ర చేశారు. అది విజయవంతంగా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ వారాహి యాత్రని మొదలుపెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్, టిడిపితో పొత్తు అనంతరం పవన్ వారాహి యాత్ర చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు పవన్ కృష్ణా జిల్లాలో యాత్ర చేయనున్నారు. జిల్లాలోని అవనిగడ్డ, పెడన, కైకలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాలుగు చోట్ల టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇటు జనసేనకు బలం ఉంది. గత ఎన్నికల్లో జనసేన-టిడిపి విడిగా పోటీ చేయడం వల్లే ఈ సీట్లలో వైసీపీ గెలిచింది. టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అంటే జనసేన-టిడిపి కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ అప్పుడే ఓడిపోయేది. ఇప్పుడు పొత్తు ఫిక్స్ అవ్వడంతో వైసీపీకి కాస్త రిస్క్ ఉంది.
ఇదే తరుణంలో పవన్ యాత్ర వైసీపీకి మరింత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. పైగా ఈ సారి టిడిపి శ్రేణులు కూడా వారాహి యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగే పవన్ వారాహి యాత్రపై అందరి ఫోకస్ కృష్ణా జిల్లాలోనే ఉంది. అదే సమయంలో పొత్తులో భాగంగా ఈ నాలుగు సీట్లలో రెండు సీట్లు జనసేన సీటుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఈ నాలుగు సీట్లలో పవన్ యాత్ర మొదలుపెట్టనున్నారు.