మద్యం కోసం ఆరాటపడుతున్న జనం

మద్యం కోసం ఆరాటపడుతున్న జనం

మద్యం కోసం జనం ఆరాటం.. వారి ఆరాటాన్ని క్యాష్ చేసుకోవాలనుకునే వ్యాపారుల ఉబలాటం.. లాభసాటి వ్యాపారం కోసం ఎంతయినా ఖర్చు చేస్తారని తెలిసి ప్రభుత్వం ఆడిన నాటకం.. వెరసి తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తులను విక్రయించడం ద్వారానే సర్కారుకు భారీగా సొమ్ము వచ్చి పడింది.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యపారవేత్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. మద్యం షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తుదారుడు నాన్ రీఫండబుల్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు చెల్లించి టెండర్లలో పాల్గొనాల్సి ఉంది. గతంలో ఇది రూ. లక్ష ఉండగా ఇప్పుడు ఏకంగా రెట్టింపు చేశారు. అయినా వ్యాపారులు ఏమాత్రం తగ్గలేదు. మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం చేకురింది.

తెలంగాణలో 2216 మద్యం దుకాణాలకు గాను దాదాపు 48,032 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి బుధవారం చివరి రోజు కావడంతో అర్థరాత్రి వరకూ దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు వసూలు చేయడంతో గతంలో వచ్చిన ఆదాయంకంటే ఈసారి రెట్టింపయ్యింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.960కోట్లకు పైగా ఆదాయం నాన్ రిఫండబుల్ ఫీజు ద్వారానే వచ్చింది.

2017 సంవత్సరంలో ప్రభుత్వానికి మద్యం షాపుల లైసెన్స్ దరఖాస్తుల రూపంలో రూ.411 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు రుసుంను పెంచడంతో ఆదాయం రెట్టింపైంది. బుధవారం దరఖాస్తుల గడువుకు చివరి రోజు కావడంతో దాదాపు 24,448 దరఖాస్తులు వచ్చాయి. సూర్యపేట జిల్లాలో 75 మద్యం దుకాణాలకు గాను 2,426 దరఖాస్తులు అందగా, సూర్యపేట జిల్లాలోని జాన్‌పహాడ్‌కు అత్యధికంగా 156 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. శుక్రవారం డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.