దేశవ్యాప్త లాక్ డౌన్ సరిహద్దుల్లో టెన్షన్ కు కారణమవుతుంది. రాష్ట్రాలు ఎక్కడివక్కడ సరిహద్దులు మూసివేశాయి. వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ బోర్డు రామాపురంలో వాహనాలు బారులు తీరాయి. సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు భారీగా ఆగిపోయాయి. తెలంగాణలోకి రావటానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు.
అదేవిధంగా వాహన దారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కరోనాపై యుద్ధం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు నుండి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ని విధిస్తూ.. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసి వేసింది.
దీంతో ఆ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఒక్క వెహికల్ ని కూడా అనుమతించకపోవటంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులంతా తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతించాలి అంటూ పెద్ద ఎత్తున వాగ్వాదానికి కూడా దిగుతున్నట్లు తెలుస్తోంది.