సామాన్యుడికి అర్థం కావడం లేదా.. చేసుకోలేకపోతున్నాడా..?

ప్రపంచమంతా కరోనా వైరస్ చుట్టూ తిరుగుతోంది. ఆ వైరస్ జనాలను అతలాకుతలం చేస్తుంది. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఈ సమయంలో బయటకు వెళ్లవద్దని ప్రభుత్వాలు మెత్తుకుంటున్నా జనాలకు అర్థం కావడంలేదు. అదేంటో చూద్దామనో ఏంటో తెలియదు గానీ.. మనషులు మాత్రం ఇంట్లో ఉండలేక పోతున్నారు. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు, రోగాలతో ప్రపంచం మొత్తం అతలాకతలమైనా.. భారత్ మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంది. ఏ సమస్యనైనా ఎదుర్కొని నిలబడగలిగింది. అందుకు కారణం.. ఈ పాలకులో.. లేక మరెవరో కాదు.. మనమే.. అంటే.. కామన్ మ్యానే. సామాన్యుడు. సమస్యలు ఎదుర్కునే విషయంలో గుండె నిబ్బరంతో… ధైర్యంగా ఉండటం అనేది మన గొప్పతనం. మరి అలాంటి సామాన్యులు ఇప్పుడు అదుపు తప్పుతున్నారు. ఆ నిబ్బరం, సహనం కోల్పోతున్నాడు. కరోనాను అడ్డుకునే విషయంలో సామాన్యుడు కనీసం సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వద్దన్న పనే చేస్తూ.. వ్యాధిని ఎదుర్కునే విషయంలో మునుపెన్నడూ లేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అసలు పరిస్థితి ఎలా ఉందో.. కరోనా సోకితే ఏమవుతుందో.. కనీసం అర్థం కాని.. తెలుసుకోలేని స్థితిలో మనిషి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అదేవిధంగా కరోనాతో చస్తే.. కనీసం కుటుంబ సభ్యులకు చివరి చూపు చూసుకునే అవకాశం కూడా లేదు. రోగం వచ్చిన కుక్క చచ్చిపోతే దాని పరిస్థితి ఏమిటో.. కరోనాతో మనిషి చచ్చిపోతే కూడా అలాంటి పరిస్థితే. కుటుంబ సభ్యులకు కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఉండదు. మృతదేహానికి నానా రకాల రసాయనాలు పూసి.. ప్లాస్టిక్ సంచిలో పొట్లం కట్టేసి.. జాగ్రత్తగా ఎవరికీ అంటకుండా పాతేస్తారు. లేదంటే.. కాల్చి బూడిద చేస్తారు. అదీ పరిస్థితి. ఆ బూడిద కూడా నీ ఇంట్లో వాళ్ళకు ఇవ్వరు. ఇలాంటి చావు మనకు అవసరమా. ఓవైపు రోగం మనల్ని మింగేస్తోందిరా నాయనా అని చెప్పినా వినిపించుకోవడం లేదు. మామూలు సమయంలో సెలవులు దొరకటం లేదని ఏడ్చే మనకు.. ఇప్పుడు వారం రోజులు ఇంట్లో హాయిగా తిని పడుకోరా అంటే ఎందుకు చెవికి ఎక్కడం లేదో అర్థం కావడం లేదు. రోడ్లపైకి రావద్దురా అని నెత్తీ నోరూ మొత్తుకొని చెప్పినా ఎందుకు పట్టడం లేదో కూడా అర్థం కావడం లేదు. దీన్ని ఏమనాలి.. పోనీ మీరు పోవాలనుకుంటే పొండి.. కానీ నీతో పాటు నలుగురి ప్రాణాలను ఎందుకు తీసుకెళ్తారు.. ఆ నలుగురిలో నీ పక్కింటి వాడే ఉంటాడో.. మీ అమ్మానాన్నలు.. అక్కాచెల్లెలే ఉంటారో.. నీ బిడ్డలే ఉంటారో.. నీకు తెలుసా.. మంత్రులు, మహామహులే అన్నీ వదులుకొని ఇంట్లో పడుకుంటే.. ఈ కామన్ మ్యాన్ కు మాత్రం ఏంటీ దరిద్రం. ఆలోచించుకోండి.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకుల మాట వినండి.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకొండి.. ఇంట్లోనే ఉండి.. కరోనా మహమ్మారిని అడ్డుకోవటంలో మీ వంతు పాత్ర నిర్వర్తించండి.. ప్లీజ్.. ఇది మన కోసం.. మన దేశం కోసం.. పాటించండి.. లేకపోతే అంతే…