లాక్‌డౌన్‌ భయంతో ఇళ్లకు చేరుతున్న జనం

లాక్‌డౌన్‌ భయంతో ఇళ్లకు చేరుతున్న జనం

నగరంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన హైదరాబాదీలు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద గురువారం వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌, పంతంగి, కొరపహాడ్‌ టోల్‌ప్లాజా, హైదరాబాద్‌-వరంగల్‌ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌, పాసులు లేని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు క్యూ కట్టాయి.

తెలంగాణ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తూ హోంక్వారంటైన్‌ స్టాంప్‌ వేస్తుంది. 14 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. వాహనాలు ఎక్కువ వస్తుండడం, నగదు మార్గంలో బారులు తీరుతుండడంతో టోల్‌ సిబ్బంది వాహనదారుల వద్దకే వెళ్లి హ్యాండ్‌మిషన్‌ ద్వారా టోల్‌ రుసుము తీసుకుంటున్నారు.