అదృష్టం వజ్రమైతే కష్టాలు తీరిపోవడమే కాకుండా క్షణాల్లో లక్షాధికారి కావచ్చు. చేయాల్సిందల్లా నేలకేసి తీక్షణంగా చూస్తూ వెళ్లాలి అంతే. మెరుగు రాయి కంటపడితే చేతిలోకి తీసుకుని పరీక్షగా చూడాలి. పది మందికి చూపించాలి. వజ్రమని రూఢీ అయితే వ్యాపారే సంప్రదిస్తారు. వజ్రం జాతి, రంగు చూసి కారెట్ల రూపంలో లెక్కించి కొనుగోలు చేస్తారు. రహస్యంగా, టెండర్ పద్ధతినవ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు.
తొలకరి వర్షాలకు జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, జీ.ఎర్రగుడి,బొల్లవాని పల్లి, చెన్నంపల్లి, పీ.కొత్తూరు, చిన్న జొన్నగిరి, రాంపురం, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల వేట మొదలైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉదయాన్నే పొలాల్లో వాలిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉదయం, సాయంత్రం ఎర్ర నేలల్లో తిరుగుతూ వజ్రాన్వేషణ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.2లక్షల విలువైన రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాన్వేషణ కోసం ఏటా ఇతర జిల్లాల నుంచి జనం వచ్చేవారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జనం తాకిడి బాగా తగ్గింది.