అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్యారల్ క్రూడాయిల్ ధర 85 డాలర్లకు చేరుకుంది. డిసెంబర్ 1న బ్యారల్ 68.87 డాలర్ల వద్ద పలికిన క్రూడాయిల్ ధర, ఆ తర్వాత మళ్లీ కరోనా దెబ్బకు ధరలు కొండెక్కడం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలలో భారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్తబ్దుగా ఉన్నాయి. వరుసగా 73వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.వారం ప్రారంభంలో అంటే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డేటాలో వెల్లడైంది.
నేడు కూడా ధరలలో ఎలాంటి మార్పు లేదని ఐఓసీఎల్ డేటా పేర్కొంది. నవంబర్ 4, 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన నగరాలలో మారడం లేదు. పెరుగుతోన్న ధరలకు చెక్ పెట్టేందుకు ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.5ను, లీటరు డీజిల్‌పై రూ.10ల ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించకముందు, వెహికిల్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. చాలా నగరాలలో, పెట్రోల్ వంద రూపాయలను దాటింది. డీజిల్ కూడా వంద రూపాయలకు చేరువలోకి చేరుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతున్నప్పటికీ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వీటి ధరలు పెరగకుండా కట్టుదిట్టం చేసింది.