చమురు కంపెనీలు సామాన్యులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి. ఈ నెలలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా సవరించిన ధరలతో లీటరు పెట్రోలుపై 34 పైసలు, లీటరు డీజిల్‌పై 37 పైసల వంతున ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ. 108.96 లకు చేరుకోగా డీజిల్ ధర రూ.102లుగా నమోదు అవుతోంది.
మే నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ ధరల పేరుతో చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలు పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర వంద దాటేయగా డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలు పెరగలేదు. గత పది రోజులుగా పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ క్రాస్ చేయగా పెట్రోలు ధర రూ. 110 కి చేరుకుంది.