తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరాలకు సర్కార్ ఫీజులు పెంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2017లో ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జారీ చేసిన జీవోలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం కొట్టేసింది.

కాగా, ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020 విద్యా సంవత్సరాలకు ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఫీజులు పెంచిందని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ జీవోలు చట్టానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు.

ఈ క్రమంలోనే పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఫీజుల పెంపు జీవోలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. టీఏఎఫ్‌ఆర్సీ 2016-19కి ఖరారు చేసిన ఫీజులనే తీసుకోవాలని కాలేజీలకు ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లయితే 30 రోజుల్లో తిరిగిచ్చేయాలని కాలేజీలను ఆదేశించింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేయాలని కాలేజీలకు కోర్టు తెలిపింది.