Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో అధికార,విపక్షాల మధ్య ఏ స్థాయిలో వైరం కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాలా ? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. టీడీపీ, వైసీపీ మధ్య ఇంత బద్ధ వైరం వున్నప్పుడు సహజంగా ఒకరికి నచ్చే విషయం ఇంకోరికి నచ్చదు. కానీ ఇప్పుడు ఓ ఫోటో మాత్రం ఇద్దరికీ తెగ నచ్చేస్తోంది. ఆ ఫోటో చూసి రెండు పార్టీల నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఇంకేంటో కాదు . ప్రధాని మోడీని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిసిన ఫోటో. ఈ ఫోటోని బయటకు విడుదల చేయడం ద్వారా చంద్రబాబు మీద పై చేయి సాధించామని వైసీపీ ఫీల్ అవుతోంది. చంద్రబాబు వల్ల కాని ప్రధాని అపాయింట్ మెంట్ ని తమ ఎంపీ సాధించాడని చెప్పడం వైసీపీ ఉద్దేశం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. వరస వైఫల్యాలతో క్యాడర్ లో నెలకొన్న నిరుత్సాహం పోగొట్టేందుకు , జగన్ కేసుల నుంచి బయటపడతాడని చెప్పేందుకు వైసీపీ ఈ ఫోటో ని ఓ అస్త్రంగా మలుచుకుంది. తాము బలంగా వున్నాం కాబట్టే బీజేపీ కూడా బాబుని వదిలించుకుని తమ వెంట నడుస్తోందని ప్రపంచానికి చాటడం వైసీపీ ఉద్దేశం.
వైసీపీ ని అంతలా ఉత్సాహపెడుతున్న ఆ ఫోటో టీడీపీ ని ఏ మాత్రం నిరుత్సాహపరచలేదు. పైగా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టు హ్యాపీగా వుంది. ప్రత్యేక హోదా మొదలుకుని పోలవరం దాకా విభజన హామీలను తుంగలో తొక్కిన బీజేపీ తో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం తమ పుట్టి ముంచుతుందని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పటి నుంచే కేంద్రంతో గొడవల వల్ల వచ్చే కొద్దిపాటి సాయం కూడా ఆగిపోతుందన్న భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహనంతో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా ఆంధ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్న బీజేపీ తో వైసీపీ అంటకాగడానికి ప్రయత్నించడం తమకు మేలే చేస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. రేపు బీజేపీ తో తెగదెంపులు చేసుకుంటే ఇలాంటి ఫోటోలు తమ వాదనకు బలం చేకూరుస్తాయని దేశం నేతలు అంటున్నారు. అయినా దేశం సంగతి ఏమో గానీ కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ మీద కోపం పెంచుకుంటున్న ఆంధ్రులకు రేపు వైసీపీ ఈ ఫోటోలు గురించి ఏ వివరణలు ఇచ్చినా ఫలితం ఉండదు.