Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. 76 ఏళ్ల స్టీఫెన్ హాకింగ్ తన జీవితంతో ప్రపంచ మానవాళికి గొప్ప సందేశం మిగిల్చి వెళ్లిపోయారు. తలరాత, విధి అనుకుని నిరాశా నిస్పృహల్లో కుంగిపోయేవారికి స్టీఫెన్ హాకింగ్ తన జీవితాన్ని మలుచుకున్న తీరు ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. స్టీఫెన్ పూర్తిపేరు స్టీఫెన్ విలియమ్ హాకింగ్. 1942 జనవరి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్ట్ షైర్ కౌంటీలో స్టీఫెన్ జన్మించారు. రెండో ప్రపంచ యుద్దం జరుగుతుండడంతో ఆయన కుటుంబం సురక్షిత ప్రాంతానికి తరలిపోయింది. తర్వాతిరోజుల్లో అందరిలానే ఆయన బాల్యం సంతోషంగానే గడిచిపోయింది. సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ చేసిన అనంతరం పీహెచ్ డీ కోసం కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చేరారు. అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది.
1962లో తొలిసారి అనారోగ్యం బయటపడింది. శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అనారోగ్యంతో ఉండగానే… ఒకరోజు మెట్లమీదనుంచి పడిపోయారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. స్టీఫెన్ కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుంది. కనీసం బూట్ల లేస్ కూడా కట్టుకోలేని స్థితికి చేరారు స్టీఫెన్. డాక్టరేట్ రాకుండానే రెండేళ్లలో మరణిస్తాడని వైద్యులు తేల్చారు. అయినా స్టీఫెన్ కుంగిపోలేదు. విధిని ఎదిరించారు. తనకు తానే కొత్త రాత రాసుకున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమైనా… తన పరిశోధనలు, అధ్యయనాలు మాత్రం ఆపలేదు. భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్త్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణ బిలాలు కూడా రేడియేషన్ ఉత్పత్తి చేస్తాయని ధృవీకరించారు. దీన్నే హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తారు. భౌతికశాస్త్రంలో ఐన్ స్టీన్ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్ పేరుగాంచారు. కృష్ణబిలాలు, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంపై ఆయన చేసిన పరిశోధనలు పెనువిప్లవం సృష్టించాయి.
మోటార్ న్యూరాన్ వ్యాధివల్ల ఆయన కదలలేకపోవడమే కాదు… మాట కూడా పడిపోయింది. చేతితో చేసే సంజ్ఞల ద్వారా ఆయన సంభాషణ కొనసాగేది. తాను రూపొందించిన ఓ కమ్యూనికేషన్ డివైజ్ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షరరూపంలోకి మారేవి. కొన్నాళ్లకు మరో చేయి కూడా పక్షవాతానికి గురికావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్ డివైజ్ ను కంట్రోల్ చేశారు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకంతోరచనలు మొదలుపెట్టారు. ఈ పుస్తకం బ్రిటిష్ సండే టైమ్స్ లో 237 వారాల పాటు బెస్ట్ సెల్లర్ గా నిలిచి రికార్డు సృష్టించింది. కాలం కథ పేరుతో ఈ పుస్తకం తెలుగులో కూడా విడుదలయింది. వర్సిటీలో ప్రొఫెసర్ గా, వ్యాసకర్తగా, ప్రసంగీకుడిగా లక్షలాది మందిలో ఆయన స్ఫూర్తి నింపారు. స్టీఫెన్ వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
కేంబ్రిడ్జిలోచదువుతున్న రోజుల్లో వ్యాధి బయటపడకముందు జానే విల్డే అనే అమ్మాయితో ఆయనకు పరిచయం కలిగింది. వ్యాధి గురించి తెలిసిన తర్వాత కూడా ఆమె స్టీఫెన్ ను పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకున్నారు. 1965లో వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురుపిల్లలు. అయితే 1995లో కొన్ని కారణాలతో వారు విడిపోయారు. ఆ తర్వాత స్టీఫెన్ తనకు నర్సుగా పనిచేసిన ఎలైన్ మాసన్ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు. 2006లో వారిద్దరు కూడా విడిపోయారు. శరీరం సహకరించకపోయినా, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులెదురయినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా పరిశోధనలతోనే ఆయన సహజీవనం చేశారు. విధిని ఎదిరించి ఐదు దశాబ్దాలకు పైగా… చక్రాల కుర్చీలోనే గడుపుతూ ఎన్నోపరిశోధనలు అందించిన స్టీఫెన్ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. గెలీలియో మరణించిన మూడు దశాబ్దాల తర్వాత జన్మించిన స్టీఫెన్ ను భవిష్యత్తులో ఆయనలానే మానవాళి గుర్తుంచుకుంటుండనడంలో ఎలాంటి సందేహం లేదు.