ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వెన‌క ఇంత‌పెద్ద వ్యూహం?

plan behind pawan kalyan comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు మీడియాతో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. జ‌ర్న‌లిస్టుల‌పైగానీ, మీడియా యాజ‌మాన్యంపైగానీ విమ‌ర్శ‌లు చేయ‌డానికి సాహ‌సించరు. కానీ అన్నింట్లోనూ విభిన్నంగా ఉండే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతోనూ త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై స్పందించాల్సి వ‌స్తే… ఆ మాట‌లు చెప్పించిన రామ్ గోపాల్ వ‌ర్మ, శ్రీరెడ్డి ల‌క్ష్యంగా ఆయ‌న విమ‌ర్శ‌లు, ప్ర‌సంగాలు సాగాలి. కానీ విచిత్రంగా ఆయ‌న ఈ వివాదంలోకి మీడియాను లాగుతున్నారు. కొన్ని చాన‌ళ్ల‌ను, కొంద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో కొన్ని చాన‌ళ్లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్న‌ది అంద‌రూ అంగీక‌రించే విష‌య‌మే. కానీ… ప‌వ‌న్ ఆరోపించిన‌ట్టుగా ఆయ‌న‌పై మీడియాకు ఎలాంటి ప‌క్ష‌పాతం లేదు. ఇంకా చెప్పాలంటే… ప‌వ‌న్ ప్ర‌జాబ‌లమెంతో స‌రిగ్గా ఊహించ‌లేని మీడియా… ఆయ‌న‌కు ఇవ్వాల్సిన దానిక‌న్నా చాలా ఎక్కువ‌గా ప్రాముఖ్య‌త ఇస్తోంద‌నే వాద‌నా ఉంది.

ప‌వ‌న్ ను అచ్చంగా భూమి మీద‌కాకుండా ఆకాశం మీద న‌డిపిస్తున్న‌ట్టుగా మీడియా వ్య‌వ‌హార‌శైలి ఉంటుందన్న తీవ్ర విమ‌ర్శ‌లూ ఉన్నాయి. కానీ ప‌వ‌న్ మాత్రం త‌న‌ను అంత‌గా మోస్తున్న మీడియాపైనే దుమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరెడ్డి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించింది త‌న త‌ల్లిని కాబ‌ట్టే… చాన‌ళ్లు ప‌దే ప‌దే ఆ వార్త‌ను ప్ర‌సారం చేశాయ‌ని, అదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లేదా లోకేశ్ లేదా ప్ర‌తిప‌క్షనేత‌ల త‌ల్లిపై కూడా ఇలాంటి ప‌ద‌జాల‌మే వాడిఉంటే మీడియా సంస్థ‌లు ఇలా ప్ర‌సారం చేసే ధైర్యంచేసేవా అని సూటిగా ప్ర‌శ్నించారు. క‌నీసం బాల‌కృష్ణ త‌ల్లిపై అలాంటి ప‌ద‌ప్ర‌యోగం చేసినా ప్ర‌సారం చేసే ధైర్యంచేసేవా అని కూడా ఆయ‌న మీడియాను నిల‌దీశారు. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి, ఎవ‌రికీ ఏనాడూ అప‌కారం త‌ల‌పెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లిపై వాడిన అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను మాత్రం ప‌దే ప‌దే టెలికాస్ట్ చేసి, దానిపై విశ్లేష‌ణ‌లు, చ‌ర్చ‌లు చేప‌డ‌తారు అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇప్పుడు చెప్పండి శ‌క్తిమంత‌మైన, ధ‌నిక మీడియా శక్తులారా..? ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే ఈ ప్ర‌త్యేక‌మైన ట్రీట్ మెంట్ ఎందుకు అని ఆయ‌న త‌న ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కారు. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు…అవి ప్ర‌సారం చేయకూడని మాట‌లే. అందుకే లైవ్ లో జ‌రిగిన ప్ర‌సారం త‌ప్ప‌…చాలా చాన‌ళ్లు శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప‌దే ప‌దే చూపించ‌లేదు. ప‌త్రిక‌లు, వెబ్ సైట్లు కూడా ఆ పదాన్ని వాడ‌లేదు. ఒక‌టి, రెండు చాన‌ళ్లు శ్రీరెడ్డి మాట‌ను ప్ర‌సారం చేస్తే చేసి ఉండొచ్చు కాక‌. అలాంటి చాన‌ళ్లు …చంద్ర‌బాబు…లోకేశ్, బాల‌కృష్ణ త‌ల్లినే కాదు..ఎవ‌రు ఎవ‌రి త‌ల్లిని దూషించినా..ప్ర‌సారంచేస్తాయి. అలాంటి చాన‌ళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన ట్రీట్ ఇవ్వ‌వు. రేటింగ్స్ కోసం ఎవ‌రికైనా ప్ర‌త్యేక ట్రీట్ ఇచ్చేందుకు వెనుకాడ‌వు.

వాస్త‌వానికి ఈ విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలుసు. అయినా ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డానికి కార‌ణం…ప్ర‌జ‌ల్లో మీడియాపై వ్య‌తిరేక‌భావం క‌లిగించే ప్ర‌య‌త్నం చేయ‌డానికే. ఇదంతా ప‌క్కా బిజేపీ స్క్రిప్టే అని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే…మీడియాను మేనేజ్ చేయ‌డంలో మ‌హాదిట్ట అయిన బీజేపీ…ఏపీ మీడియా ముందు మాత్రం వెల‌వెల‌బోయింది. జాతీయ మీడియాను సైతం క‌నుస‌న్న‌ల్లో న‌డిపించగ‌లిగిన మోడీ…ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న‌హామీలు అమ‌లుకోసం చంద్ర‌బాబు చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన ఏపీ మీడియాను నియంత్రించ‌లేక‌పోయారు. అందుకే ప్ర‌స్తుతం బీజేపీ చెప్పిన‌ట్ట‌ల్లా ఆడుతున్న ప‌వ‌న్ ను రంగంలోకి దించారు. శ్రీరెడ్డి వివాదం విష‌యంలో మీడియా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్న నేప‌థ్యంలో ఆ వ్య‌తిరేక భావ‌న‌ను మ‌రింత పెంచడానికి ప‌వ‌న్ ఈ అంశాన్ని ఉప‌యోగించుకుంటున్నార‌నే విశ్లేష‌ణలు వినిపిస్తున్నాయి. ఏపీ మీడియాను ప్ర‌జ‌లు వ్య‌తిరేకించేలా చేయ‌డం ద్వారా చంద్ర‌బాబును దారిలోకితేవాల‌న్న‌ది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.