ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. అనంతరం ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామన్న మాట బెట్టుకుంటామన్నారు. వైఎస్ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.