ఆదివారం దిశ కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఆమె దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండగానే ఎన్హెచ్ఆర్సీ బృందం నుంచి పిలుపు వచ్చింది. విచారణ కోసం తెలంగాణ పోలీస్ అకాడమీకి రమ్మని కబురు పంపారు. అసలే బాధలో ఉన్నాం. ఇప్పుడు రాలేమంటూ దిశ కుటుంబ సభ్యులు వేడుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసుల తీరుపై బంధువులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. దశదిన కర్మ పూర్తయిన తర్వాత దిశ తండ్రిని, సోదరిని పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు. ఇదే విచారణ దిశ ఇంటి వద్ద కూడా ఎన్‌హెచ్చార్సీ బృందం చేయొచ్చు.. కావాలసిన ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టుకోవచ్చు. కానీ బాధితులనే నిందితులుగా చూసే పరిస్థితి మారాలంటున్నారు స్థానికులు. నిబంధనల పేరుతో బాధితులను ఇంకా ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు.