రాపూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావు ఆదివారం డక్కిలిలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నాగేశ్వరరావు తన స్నేహితులతో కలిసి డక్కిలి ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు.
స్నేహితులు గుర్తించి అతడిని వెంటనే డక్కిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మండలంలోని మిట్టవడ్డిపల్లిలో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి చేరుకుని భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుల్‌కు భార్య, ఐదేళ్లు, రెండేళ్ల వయస్సున్న కుమార్తెలున్నారు. డక్కిలి ఎస్సై నరసింహారావు విచారణ చేసి కేసు నమోదు చేశారు.