మిర్యాలగూడ లో పరువు హత్య కి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చారు. ప్రణయ్ హత్య వెనుక అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అమృత తండ్రి హస్తం ఉందని తేల్చారు. దాడి జరిగిన సమయంలో షాక్ తిన్న అమృత కి ఆస్పత్రిలోనే ఇక ప్రణయ్ లేడన్న వార్త తెలిసింది. ఐదు నెలల గర్భిణిగా వున్న ఆమె ఓ వైపు భర్త ని కోల్పోయి, ఇంకో వైపు తండ్రి ఈ పని చేయించాడని తెలియడంతో అల్లాడిపోతోంది. ఆమె ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. అంత విషాదంలో కూడా ఆమె ప్రణయ్ ని చంపించిన తన తండ్రిని ఉరి తీయాలని డిమాండ్ చేసింది.
ఈ మధ్య తన ప్రేమని ఒప్పుకున్నట్టు కనిపించిన తండ్రి ఇంత అఘాయిత్యానికి ఒడికడతాడని అసలు ఊహించలేదని అమృత అంటోంది. కులం పేరుతో మా నాన్న నా జీవితాన్ని సర్వనాశనం చేసాడని అమృతవర్షిణి కన్నీరుమున్నీరు అవుతోంది. ఇంకో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు అని భావిస్తున్న మారుతీరావు ని,అతని తమ్ముడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకి నిరసనగా ఈ రోజు బంద్ జరిగింది.
అటు వివిధ పార్టీల నాయకులు ఈ హత్యని ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఇంకొందరు ఆస్పత్రికి వెళ్లి అమృతవర్షిణిని పరామర్శిస్తున్నారు. మొత్తానికి ఈ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.