విప్లవ రచయితల సంఘం(విరసం) నేత, కమ్యూనిస్టు నాయకుడు వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలైనట్లు సమాచారం.
వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వరవరరావు ఇంటిదగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోదాలు నిర్వహిస్తున్న వార్త తెలుసుకున్న పలువురు విరసం, వరవరరావు మద్దతుదారులు వరవరరావు ఇంటికి పెద్దఎత్తున వస్తున్నారు. సోదాలు జరుగుతున్న ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. తెలంగాణ పోలీసుల సహకారంతోనే ఈ దాడులు చేస్తున్నారని వరవరరావు గొంతును ఆపేయడానికి కుట్రలో భాగంగా ఈ సోదాలని ఆరోపించారు.
అందుతున్న సమాచారం మేరకు దాదాపు ఎనిమిది గంటల విచారణ, సోదాల అనంతరం ఇప్పుడు వరవరావుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర చేసిన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.