హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర లభ్యమైన గర్భిణి మృతదేహం కేసు నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిండు గర్బిణిని కనికరం లేకుండా దారుణంగా హతమార్చిన కిరాతకులను వెతికిపట్టుకోవడానికి తాము పడిన శ్రమను కూడా పోలీసులు వివరించారు. మృతురాలి పేరు పింకీ. ఆమెది బీహార్ లోని ఓ కుగ్రామం. ఆమె తండ్రి రాజస్థాన్ లోని ఓ ఇటుకల బట్టీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. పింకీకి 15 ఏళ్ల క్రితం దినేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత ఏడాది భర్త నుంచి విడిపోయిన పింకీ కుమారుణ్ని తీసుకుని వచ్చేసింది. అనంతరం వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేయసాగింది. అయితే వికాస్ కు పింకీ కన్నా ముందు మమతా ఝా అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
మమతా ఝా భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్ కాంత్ ఝా తో కలిసి బతుకు తెరువు కోసం కొన్నేళ్లక్రితం హైదరాబాద్ వచ్చింది. తర్వాత వికాస్ కూడా హైదరాబాద్ వచ్చి వారితో కలిసి పానీపూరీ బండి నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన ప్రియుణ్ని వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అమర్ కాంత్ కుటుంబంతో కలిసి ఉంటున్న వికాస్ కు అతని తల్లి మమతతో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని గమనించిన పింకీ దీనిపై వికాస్ ను నిలదీసింది. ఈ నెల 29న ఇది పెద్ద గొడవకు దారితీసింది. కోపంతో మమత, ఆమె భర్త అనిల్, కొడుకు అమర్, వికాస్ అందరూ కలిసి పింకీని విపరీతంగా కొట్టారు.
నిండు నెలల గర్భిణి కావడంతో ఆ దెబ్బలకు తాళలేక పింకీ చనిపోయింది. ఆ తర్వాత వారంతా కలిసి స్టోన్ కట్టర్ తో మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి గోనెసంచిలో కట్టారు. ముఖం గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. తెల్లవారుజామున అమర్, మమత కలిసి గోనెసంచిని బైక్ పై పెట్టుకుని బొటానికల్ గార్డెన్ వద్దకు తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. నిండు గర్భిణి దారుణంగా హత్యకు గురికావడంతో సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఛాలెంజిగ్ గా తీసుకుని దర్యాప్తుచేశారు. సీసీ కెమెరాల్లో లభ్యమయిన దృశ్యాల ఆధారంగా నిందితులు సిద్ధిఖినగర్ వాసులుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు…వారికోసం అక్కడ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. అయితే కార్డాన్ సెర్చ్ సమయంలో హత్య కేసు ప్రధాన నిందితుడు అమర్ కాంత్ బాత్ రూంలో దాక్కుని తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు మరో వారం రోజులు శ్రమించాల్సివచ్చింది. 150 సీసీ కెమెరాల్లో ఈ ఘటనను పరిశీలించి నిందితుల ఆచూకీ కనిపెట్టినట్టు సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. టెక్ మహీంద్ర కార్యాలయం వద్ద ఉన్న సిసీ కెమెరా దృశ్యాలు నిందితులను పట్టించాయని చెప్పారు.