ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత.

Police Surrounding to Mudragada Home in Kirlampudi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో మరోసారి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రేపటినుంచి రెండు రోజుల పాటు కోనసీమ పర్యటన తలపెట్టారు ముద్రగడ. కాపు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారిని ఈ నెల 8 ,9 తేదీల్లో ఆత్మీయ పలకరింపు పేరిట కలుసుకోవాలని ముద్రగడ భావించారు. పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానుల్ని పలకరించడానికి ముద్రగడ చేస్తున్న ప్రయత్నానికి పోలీసుల నుంచి ఇలా బ్రేక్ పడినట్టే వుంది.

కాపు రిజర్వేషన్ డిమాండ్ తో ” ఛలో అమరావతి ” పేరిట పాదయాత్ర తలపెట్టినప్పటినుంచి ముద్రగడ ని బయటికి రాకుండా ఇప్పటికే ఎన్నో సార్లు పోలీసులు అడ్డుకున్నారు. తుని విధ్వంసం నేపథ్యంలో ఈ విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే జీవిత కాలం పాటు ముద్రగడ పదిమందితో కలిసి బయటికి వచ్చే అవకాశం లేదా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రకటనలకు, పోలీసు చర్యలకి సంబంధం లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. ముద్రగడ ఎక్కడికైనా వ్యక్తిగతంగా వెళ్లొచ్చని, పోలీస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని హోమ్ మంత్రి చినరాజప్ప చెప్తున్న మాటలకి పోలీసుల తీరుకి సంబంధం ఎక్కడని వారు నిలదీస్తున్నారు. అయితే ముద్రగడ తలపెట్టింది వ్యక్తిగత పర్యటన కాదని పోలీసులు వాదిస్తున్నారు. వ్యక్తిగత హోదాలో ఆయన ఇప్పటికే కొన్ని పర్యటనలు చేసినా తాము అడ్డుకోలేదని ఖాకీలు గుర్తు చేస్తున్నారు. ఇద్దరి వాదనలు ఎలా వున్నా కిర్లంపూడి వాసులు మాతం మాటిమాటికీ వూళ్ళో ఉద్రిక్త పరిస్థితులు ఏంటా అని ఇబ్బంది పడుతున్నారు.