ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటచేసుకుంది. బాపట్ల బస్టాండ్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య సంచలనానికి దారితీసింది. లాక్డౌన్ నేపథ్యంలో తిరుపతి నుంచి సొంతూరుకు వస్తున్న యువకుడిని పోలీసులు అడ్డగించి ఇబ్బంది పెట్టడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ దారుణం జరిగింది. అయితే అతను పోలీసులు ఇబ్బంది పెట్టడంతోనే మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఆ యువకుడు చనిపోయే ముందు తన చావుకు పోలీసులే కారణమని తీసకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కాగా తిరుపతిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రీనివాస్.. లౌక్ డౌన్ తో మోటార్ వాహనంగై సొంతూరికి బయల్దేరాడు. తిరుపతి నుంచి వస్తున్న శ్రీనివాస్‌ని గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలోని వెదుళ్లపల్లి అంతర్ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను చూసి భయపడిపోయిన శ్రీనివాస్ బైక్ ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న వెదుళ్లపల్లి ఎస్సై.. తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బైక్‌పై పారిపోతున్న శ్రీనివాస్‌ని మరో చెక్‌పోస్టు వద్ద పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
అంతటితో ఆగకుండా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ పేరుతో శ్రీనివాస్‌ని కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు అతనిని అక్కడే ఉంచి మరుసటి రోజు ఉదయం స్టేషన్ నుంచి పోలీసులు పంపించేశారు. బాపట్ల వరకూ లారీలో ఎక్కించి పంపించినట్లు తెలుస్తోంది. పోలీసుల వ్యవహార శైలితో అప్పటికే మనస్థాపానికి గురైన శ్రీనివాస్.. బాపట్లలో లారీ దిగి కొత్త బస్టాండ్‌కి వెళ్లాడు. అదే బస్టాండ్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే అతను చనిపోయే ముందు తన చావుకు వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. పోలీసుల అత్యుత్సాహం వల్లే యువకుడు మరణించాడన్న విమర్శలు రావడంతో పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. యువకుడి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో పోలీసుల అత్యుత్సాహం ఓ ప్రాణాన్ని బలికొంది.